రెండ్రోజుల క్రితమే జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. 2023-24 సంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24-31 మధ్య జరగనున్నాయి. సెషన్ -2 పరీక్షలను ఏప్రిల్ 6 నుండి 12 తేదీల మధ్య నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షలమంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అంతలోనే దరఖాస్తు ఫీజులను భారీగా పెంచుతూ మరో ప్రకటన చేసింది ఎన్‌టీఏ. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలకు ఇప్పటి వరకు రూ. 650 ఫీజు వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ. 1000కి పెంచేసింది.
అదే కేటగిరీలోని అమ్మాయిల దరఖాస్తు ఫీజు రూ.325 ఉండగా.. దానిని రూ.800 చేసింది. ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగుల దరఖాస్తుల ఫీజు రూ. 325 వసూలు చేస్తుండగా.. ఆ ఫీజును రూ.500కు పెంచుతున్నట్లు పేర్కొంది. విదేశీ అమ్మాయిల దరఖాస్తు ఫీజును రూ.1500 నుండి రూ.4000కు, విదేశీ అబ్బాయిల ఫీజును రూ.3,000 నుండి రూ.5,000కు పెంచింది. వాటితోపాటు బీఆర్క్, బీ ప్లానింగ్‌లో చేరేందుకు నిర్వహించే పేపర్-2 దరఖాస్తు ఫీజును కూడా భారీగా పెంచారు.
బీఈ, బీఆర్క్, బీ టెక్ కోర్సులలో జనరల్, ఓబీసీ కేటగిరీలలో అబ్బాయిలకు దరఖాస్తు ఫీజు రూ.2000, అమ్మాయిలకు రూ.1600గా నిర్ణయించారు. ఇదే కేటగిరీల్లో విదేశీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు అబ్బాయిలకు రూ.10,000, అమ్మాయిలకు రూ.8000కు పెంచేశారు. ఎస్సీ, ఎస్టీ లకు చెందిన అబ్బాయిలకు, అమ్మాయిలకు దరఖాస్తు ఫీజు రూ.1000, విదేశీ విద్యార్థులకు రూ.5000 గా నిర్ణయించారు. థర్డ్ జెండర్ కు చెందిన లోకల్ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000, నాన్ లోకల్ రూ.5000గా ఫీజులు నిర్ణయించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా పెంచిన దరఖాస్తు ఫీజుల్ని చూసి.. విద్యార్థులు షాకవుతున్నారు.