Amith shah on sardar Vallabhbhai Patel: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వారసత్వాన్ని గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శించారు. పటేల్ 150వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పటేల్ మరణించిన తర్వాత ఆయన వారసత్వాన్ని చెరిపివేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు.
పటేల్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏకంగా 41 సంవత్సరాలు పట్టిందిని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఆలస్యాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా చూడవచ్చని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సర్దార్ పటేల్‌కు సముచిత గౌరవం దక్కిందని హోంమంత్రి స్పష్టం చేశారు. మోదీజీ ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని నిర్మించి, పటేల్‌కు అసలైన గౌరవాన్ని అందించారని ఆయన గుర్తుచేశారు.
సర్దార్ పటేల్ కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక సిద్ధాంతం అని అమిత్ షా అభివర్ణించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మరియు దేశాన్ని ఏకీకృతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రతి ఏటా అక్టోబర్ 31న ప్రధాని మోదీ కేవడియాకు వచ్చి పటేల్‌కు నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది నుండి పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31న ప్రతి సంవత్సరం భారీ పరేడ్ నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు అమిత్ షా ప్రకటించారు.
ఈ సందర్భంగా, ఈ సంవత్సరం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా స్థాయిలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
అదనంగా, నవంబర్ 1 నుంచి 15 వరకు ఏక్తా నగర్‌లో ‘ఏక్ భారత్ పర్వ్’ కార్యక్రమం ఉంటుందని, ఇది గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతినాడు ముగుస్తుందని హోంమంత్రి వివరించారు. దేశ సమగ్రత విషయంలో పటేల్ నాయకత్వ పటిమను గుర్తుచేస్తూ, స్వతంత్రం వచ్చినప్పుడు.. ఆ ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్ర్య వేడుకల్లో ఉండగా, సర్దార్ పటేల్ మాత్రం లక్షద్వీప్‌ను కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్లను పర్యవేక్షించాలని, ఆయన నిర్ణయం వల్లే ఆ దీవులు భారత్‌లో అంతర్భాగమయ్యాయని అమిత్ షా వివరించారు.


