Agents Use Dead Man’s ID To Get Passport: అస్సాంలో దారుణమైన మోసం వెలుగులోకి వచ్చింది. మరణించిన వ్యక్తి గుర్తింపు పత్రాలను ఉపయోగించి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి భారత పాస్‌పోర్ట్ ఇప్పించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. అస్సాంలో అక్రమ వలసలు, నకిలీ పత్రాల వాడకం ఎంత విస్తృతంగా ఉందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతిచెందిన ఓ భారతీయ పౌరుడికి చెందిన జనన ధృవీకరణ పత్రాన్ని (Birth Certificate) అక్రమంగా సంపాదించిన ఏజెంట్లు, దాని ఆధారంగా బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తికి పాస్‌పోర్ట్ దరఖాస్తు చేయించారు. ఇది గువహటిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK)లో సాధారణ ధృవీకరణ ప్రక్రియలో భాగంగా అధికారులకు అనుమానం కలిగించింది. దరఖాస్తులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించగా, అది నకిలీదని, దరఖాస్తుదారు భారత పౌరుడు కాదని తేలింది.
ఫరూక్ అహ్మద్ అనే భారతీయుడు గుర్తింపు పత్రాలతో నిందితులు ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ ఐడీలతో వారు బంగ్లాదేశ్ వ్యక్తి కోసం ఇప్పటికీ ఆధార్, ఓటర్ ఐడీ సాధించారు. అయితే పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో దొరికిపోయారు. దీంతో వెంటనే పాస్‌పోర్ట్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రధాన పాత్రధారులుగా ఉన్న ఇద్దరు ఏజెంట్లు బుర్హాన్ ఉద్దీన్, ఫైజుర్ రెహ్మాన్‌లను అరెస్టు చేశారు. మృతిచెందిన వ్యక్తి జనన ధృవీకరణ పత్రాన్ని అక్రమంగా పొంది, దానిని బంగ్లాదేశ్ వ్యక్తికి ఉపయోగించేందుకు ప్రయత్నించినట్లు వారు అంగీకరించారు. అరెస్టయిన ఏజెంట్లపై ఫోర్జరీ, మోసం మరియు అక్రమ వలసలకు సహాయం చేసిన అభియోగాలపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం పెద్ద స్థాయిలో ఏదైనా నెట్‌వర్క్‌లాగా జరుగుతోందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


