విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త రైల్వే జోన్ లో రాయలసీమ రైల్వే ప్రాంతాలు విభజన చేసి, తిరుపతి కేంద్రంగా కొత్తగా రాయలసీమ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని, నంద్యాల జిల్లాలోని రైల్వే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కావున ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా రాయలసీమ ప్రాంతం పరిధిలోని రైల్వే స్టేషన్ లు రాయలసీమలో హెడ్ క్వార్టర్ పరిధిలో ఉండేందుకు అనువుగా కొత్త రాయలసీమ రైల్వే డివిజన్ అవసరమని కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
1)కర్నూలు రైల్వే స్టేషన్ రాయలసీమలోని ప్రాంతం, ఇక్కడున్న రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ డివిజన్ పరిధిలో ఉంది, ఈ కర్నూలు రైల్వే స్టేషన్ ను గుంతకల్లు డివిజన్లో కలపాలి
2)నంద్యాల రైల్వే స్టేషన్ రాయలసీమలోని ఒక ముఖ్య ప్రాంతం, నంద్యాల రైల్వే స్టేషన్ కోస్తాంధ్ర గుంటూరు డివిజన్ పరిధిలో ఉంది, ఈ నంద్యాల రైల్వే స్టేషన్ ను గుంతకల్లు డివిజన్ లో కలపాలని,
3) తిరుపతి, కడప రైల్వే స్టేషన్లు గుంతకల్లు డివిజన్ లో ఉన్నాయని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వివరించి, ఈ మూడు రైల్వే స్టేషన్ లను కలిపి కొత్త డివిజన్ తిరుపతి కేంద్రంగా రాయలసీమ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి కొత్తగా ఏర్పాటు కాబోయే విశాఖపట్నం రైల్వే జోన్ లో కలిపి రాయలసీమ ప్రాంత వాసుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని కోరారు.
విశాఖపట్నం – తిరుపతి ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను నంద్యాల వరకు పొడిగించాలని, (ట్రైన్ నెంబరు 17477/17488)
ప్రస్తుత రూట్
విశాఖపట్టణం – విజయవాడ – తిరుపతి – కడప వరకు నడుస్తున్న ఈ రైలును గుంతకల్లు వరకు నడిపేందుకు ఇటీవల రైల్వే అధికారులు ప్రతిపాధనలు చేశారని, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప, నంద్యాల మీదుగా ఈ రైలు గుంతకల్లు వరకు నడపాలని, దీంతో నంద్యాల నుంచి తిరుపతి కి కనెక్టివిటీ పెరిగి రైలు ప్రయాణికులకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి కి ఎంపీ శబరి వివరించారు.
నంద్యాల జిల్లా బేతంచెర్ల రైల్వే స్టేషన్ లో కరోనా కు ముందు అమరావతి 17225/17226, ప్రశాంతి 18463/18464, కొండవీడు 17211/17212 రైళ్లకు స్టాఫ్ ఉండేదని, కరోనా తర్వాత బేతంచెర్ల రైల్వే స్టేషన్ లో రైళ్లు ఆగడం లేదని, దీంతో తూర్పు వైపు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, హౌరా వరకు, పరమడ వైపు అనంతపురం, పుట్టపర్తి, హిందూపూర్, గుంతకల్లు, బళ్లారి, హుబ్లీ, బెంగళూరు, ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, గత నెల మొదటి వారంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొత్తగా, ప్రయోగాత్మకంగా 57 రైళ్ల ను 6 నెలల పాటు వేరువేరు ప్రాంతాలలో స్టాఫ్ లు ఇచ్చారని, 17216 ధర్మవరం – మచిలీపట్టణం రైలుకు మార్కాపురం, గిద్దలూరులలో స్టాఫ్ లు ఇచ్చారని, 17216 కొండవీడు ఎక్స్ ప్రెస్ కు కంభం లో స్టాఫ్ ఇచ్చారని ఈ ప్రతిపాధనలో బేతంచెర్ల లేదని ఈ సమస్య పరిష్కరించాలని, నంద్యాల పట్టణం, సమీపంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అండర్ రైల్వే బ్రిడ్జిలు మంజూరు చేయాలని తదితర రైల్వే సమస్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వినతి పత్రం రూపంలో అందజేశారు.