Defence PSUs Miniratna status : భారత రక్షణ రంగం ఆత్మనిర్భరత దిశగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు (DPSUs) ప్రతిష్టాత్మక ‘మినీరత్న’ హోదాను కైవసం చేసుకున్నాయి. ఈ అద్భుతమైన ఘనత సాధించిన సంస్థలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలతో ముంచెత్తారు. అసలు, ఈ ‘మినీరత్న’ హోదా అంటే ఏమిటి? ఈ గుర్తింపుతో ఆ సంస్థల రూపురేఖలు ఎలా మారనున్నాయి? ఆ వివరాలేమిటో చూద్దాం.
ఘనంగా సత్కారం : సోమవారం న్యూదిల్లీలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో నూతనంగా ప్రారంభించిన డీపీఎస్‌యూ భవన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలపై ఒక సమగ్ర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ‘మినీరత్న (కేటగిరీ-I)’ హోదాను పొందిన నాలుగు సంస్థలను రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా సత్కరించి, వాటి పనితీరును ప్రశంసించారు. ఆ సంస్థలు.
మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (MIL)
ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL)
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL)
హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)
‘మినీరత్న’తో పెరగనున్న స్వేచ్ఛ : ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే ప్రతిష్టాత్మక హోదాలలో ‘మినీరత్న’ ఒకటి. ఈ హోదా పొందిన సంస్థలకు ఆర్థిక, కార్యాచరణ స్వేచ్ఛ గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వ అనుమతి లేకుండానే రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయడం, విదేశాల్లో కార్యాలయాలు తెరవడం వంటి కీలక నిర్ణయాలను ఈ సంస్థలు ఇకపై స్వతంత్రంగా తీసుకోగలుగుతాయి. ఇది వాటి సామర్థ్యాన్ని పెంచి, మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది.
ఈ హోదా లభించడం ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో కీలక ముందడుగు అని, ఇది రక్షణ రంగంలో ఆవిష్కరణలను, సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశ రక్షణ అవసరాలను తీర్చడంలో ఈ సంస్థలు మరింత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


