ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Delhi Election Results) బీజేపీ పూర్తి మోజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు 45కు పైగా స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. దీంతో ఢిల్లీలో బీజేపీ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
27 ఏళ్ల విరామం తర్వాత దేశ రాజధానిలో తిరిగి కాషాయ జెండా పాతనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు(BJP Celebrations) చేసుకుంటున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు డ్యాన్సులు చేస్తూ టపాసులు కాల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియా మాట్లాడుతూ ఢిల్లీలో డబల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
కాగా 1998 నుంచి ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేదు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. 2015, 2020 ఎన్నికలలో భారీ మెజారిటీతో ఆప్ గెలిచింది.