ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Election Results)ల్లో బీజేపీ పూర్తి మోజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు 42 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో లీడ్‌లో ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. దీంతో ఢిల్లీలో బీజేపీ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి భాగస్వామి పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) చేసిన ట్వీట్ వైరల్‌గా మారుతోంది.
‘అవుర్ లడో ఆపస్ మే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇండియా కూటమి అని పేరు పెట్టుకుని మనం.. మనం కొట్లాడితే ఫలితాలు ఇలానే వస్తాయి. ఇంకా కొట్లాడుకోండి, ఇంకా దారుణ ఫలితాలు చూస్తారు” అంటూ రామాయణం వీడియోను షేర్ చేశారు. కాగా లోక్ సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ ఇండియా కూటమి తరపున కలిసి పోటీ చేశారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా బరిలో దిగారు. అంతేకాకుండా కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ.. రాహుల్ గాంధీపై ఆప్ నేతలు విమర్శలు చేసుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆప్ ఓట్లను భారీగా చీల్చడంతో ఆ పార్టీ అధికారం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.