రేఖా గుప్తా మూడు సార్లు కౌన్సిలర్ గా పనిచేసిన రాజకీయ అనుభవమున్న మహిళా నేత. ఢిల్లీ దక్షిణ ప్రాంత మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూడా ఆమెకు హస్తిన రాజకీయాలు, హస్తిన స్థానిక విషయాలపై గట్టి పట్టుంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నప్పుడే స్టూడెంట్ యూనియన్ లీడర్ గా పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టిన రేఖా గుప్త మొదటి నుంచీ ఢిల్లీ సీఎం రేసులో బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మహిళా ఓటర్లు తమకు ఎంత కీలకమూ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పిన కమలనాథులు ఢిల్లీకి మహిళా సీఎం అయితేనే బెస్ట్ అనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. గతంలోనూ సుష్మా స్వరాజ్ ను సీఎంగా నియమించిన అనుభవమున్న కాషాయపార్టీ ఇప్పుడు రేఖాకు ఆ ఛాన్స్ ఇచ్చి ఢిల్లీకి షిఎంను కానుకగా ఇచ్చినట్టు సగర్వంగా చెప్పుకుంటోంది.

రెండుసార్లు ఓటమిపాలైనా
మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా ఆ వెంటనే సీఎం ఛాన్స్ కొట్టేయటం విశేషం. ‘హర్యానా కీ బేటీ’, కామ్ హీ పెహ్చాన్ అంటూ రేఖా గుప్తాను ఇప్పుడు ఢిల్లీ వాసులు గుర్తుచేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో సైతం 50 ఏళ్ల రేఖ చాలా ఉత్సాహంగా ప్రచారం చేస్తూ కనిపిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. రేఖ క్యాంపెయిన్ కూడా అందరినీ ఆలోచింపచేసేలా ‘కామ్ హి పెహచాన్’ అనే ట్యాగ్ లైన్లతో ప్రచారంలో దూసుకెళ్లేలా చేసింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓటమిపాలైనా మూడవసారి అదే నియోజకవర్గం నుంచే రేఖా గెలవటం విశేషం.
3 దశాబ్దాలుగా బీజేపీతోనే
బీజేపీ మహిళా మోర్చా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్నారు. అంతకు ముందు ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రెటరీగా ఆమె విస్తృతంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్న రేఖా గుప్తా .. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తరువాత నాలుగవ మహిళా సీఎంగా రికార్డు సృష్టిస్తున్నారు.
రేఖానే ఎందుకంటే?
వివాదరహితురాలిగా ఉన్న లీడర్ గా రేఖాకు మంచి పొలిటికల్ మైలేజ్ వచ్చేలా బీజేపీ ముందుజాగ్రత్తలు తీసుకుంది. అంతేకాదు ఫ్రెష్ ఫేస్ కావటంతో ఎటువంటి పాత రాజకీయ-వ్యక్తిగత మకిలీలు ఇప్పట్లో అంటవనే ధైర్యం ఢిల్లీ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పైగా మహిళా నేత కూడా కావటంతో విద్యాధికులు అధికంగా ఉన్న దేశ రాజధానిలో ఓ గొప్ప సందేశాన్ని కమలనాథులు నోటితో కాకుండా చేతితో ఇచ్చేలా రేఖాను ఏరి కోరి ముఖ్యమంత్రిగా పట్టం కట్టేలా చేసింది.
రెండుసార్లు ఓడిన చోట నుంచే
షాలిమార్ బాగ్ నియోజకవర్గంలో బందన కుమారి అనే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి చేతిలో రెండుసార్లు ఇక్కడి నుంచే ఓటమిపాలైన రేఖ మూడవసారి బందనను ఓడించి, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఏకంగా సీఎం పదవిని అధిరోహిస్తుండటం హైలైట్.