Goa Tourism: పర్యాటక రంగంపై ఆధారపడిన గోవా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. గోవాలో లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. వారి సంరక్షణ మరియు పర్యాటక ప్రదేశాల్లో అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా గోవా టూరిస్టు ప్లేసెస్ (ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్) సవరణ బిల్లు 2025ను ఆమోదించింది. ఈ బిల్లులో “న్యూసెన్స్” అనే పదానికి విస్తృత నిర్వచనాన్ని అందించింది. ఇందులో అసభ్యకరమైన ప్రవర్తన, దందాలకు పాల్పడడం, అక్రమ గైడ్ సేవలు, డ్రగ్ సరఫరా, పర్యాటకులకు ఇబ్బంది కలిగించే కార్యకలాపాలు, అనధికార బోట్లను లేదా కాలుష్యం, ప్రమాదాలకు కారణమయ్యే తేలియాడే వస్తువులను ఆపరేట్ చేయడం, పర్యాటకులను వస్తువులు కొనాలంటూ వేధించడం, అనధికారిక ప్రదేశాల్లో మద్యం సేవించడం, గ్లాసులు పగలగొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో వంట చేసుకోవడం, చెత్త వేయడం, అనధికారికంగా వాటర్ స్పోర్ట్స్ నిర్వహించడం వంటివి అన్నీ న్యూసెన్స్ కిందకు వస్తాయి.
Readmore: https://teluguprabha.net/national-news/pragya-thakur-on-malegaon-case/
గోవా ప్రభుత్వం సవరించిన సెక్షన్ 10 ప్రకారం పర్యాటకులకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినంగా మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం, ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కనీసం రూ.5,000 నుంచి గరిష్టంగా రూ.1,00,000(లక్ష) వరకు జరిమానాలు విధించబడనున్నాయి. ప్రభుత్వం ఈ జరిమానాలను ప్రతి ఏడాదికి రెండు సార్లు సమీక్షించనుంది. అలాగే, సంబంధిత అధికారుల సిఫార్సుల ఆధారంగా ప్రతి రెండు సంవత్సరాలకు వీటిని 10 శాతం వరకు పెంచే అవకాశం కూడా ఈ చట్టంలో ఉంది.
గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే మాట్లాడుతూ.. పర్యాటక ప్రాంతాల్లో అనధికార ఏజెంట్ల పనులు, అనధికార ప్రచార కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయి. ఈ బిల్లుతో ఈ వ్యాప్తిని అరికట్టడంలో ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులకు రక్షణ, శాంతి భద్రతలను కల్పించడం, పర్యావరణానికి హాని కలిగించే ఉల్లంఘనలను నివారించడం ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు అని తెలిపారు. అటు పర్యాటకులకు, ఇటు స్థానికులకు నష్టం కలిగించే సంఘటనలు పెరుగుతున్న నేపధ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.


