Jabalpur child prodigy Arav Patel : పదకొండేళ్ల వయసు.. చదువు తొమ్మిదో తరగతి.. పాఠాలు చెప్పేది మాత్రం పదో తరగతికి! గణితం, సైన్స్ అంటే నీళ్ల ప్రాయం. ప్రపంచ దేశాల రాజధానులు గడగడా చెప్పేస్తాడు. ఈ అసాధారణ ప్రతిభావంతుడి పేరు ఆరవ్ పటేల్. ఇతని మెదడు ఓ సూపర్ కంప్యూటర్ అంటూ సాక్షాత్తూ హైకోర్టు నియమించిన నిపుణులే కితాబిచ్చారు. అసలు ఎవరీ ఆరవ్ పటేల్? అతని మెదడు అంత చురుగ్గా ఎలా పనిచేస్తుంది? వయసు నిబంధనను అధిగమించి పై తరగతిలోకి వెళ్లేందుకు ఏకంగా హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఎందుకొచ్చింది..?
తొలి గురువు అమ్మే.. ప్రోత్సాహం నాన్నదే : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన ఆరవ్ పటేల్ ప్రస్థానం అతని ఇంట్లోనే మొదలైంది. అటవీ శాఖలో గార్డుగా పనిచేసే తండ్రి దిలీప్, బీఈడీ పూర్తిచేసిన తల్లి సంధ్య.. తమ కుమారుడిలోని అసాధారణ గ్రహణశక్తిని చిన్న వయసులోనే పసిగట్టారు. ముఖ్యంగా, విద్యాబోధనలో నైపుణ్యం ఉన్న తల్లి సంధ్య, ఆరవ్‌కు తొలి గురువైంది. పాఠశాలలో చేర్పించకముందే ఇంట్లోనే గణితం, సైన్స్, జనరల్ నాలెడ్జ్‌లో ఓనమాలు దిద్దించింది. ఫలితంగా, ఆరవ్ కేవలం రెండున్నర ఏళ్ల వయసులోనే అట్లాస్‌లోని అన్ని దేశాలు, వాటి రాజధానుల పేర్లను చెప్పి ఆశ్చర్యపరిచాడు. “నా కొడుకు ఎప్పుడూ ట్యూషన్లకు వెళ్లలేదు. కానీ కాన్సెప్ట్‌లను చాలా త్వరగా అర్థం చేసుకుంటాడు. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలుపుతోంది,” అని తల్లి సంధ్య గర్వంగా చెబుతారు.
పాఠశాలలోనూ ప్రతిభే.. దూసుకెళ్లిన చదువు : ఆరవ్‌కు రెండున్నర ఏళ్ల వయసులో పాఠశాలలో చేర్పించడానికి వెళ్లిన తల్లిదండ్రులకు ఓ ఆసక్తికర అనుభవం ఎదురైంది. ఆరవ్ ప్రతిభను చూసిన ఉపాధ్యాయులు, “ఈ పిల్లాడికి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ అవసరం లేదు” అని చెప్పి, నేరుగా ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించారు. అక్కడ కూడా తన చురుకుదనంతో ఉపాధ్యాయులను అబ్బురపరిచి, ఒకటో తరగతి పూర్తి కాగానే నేరుగా మూడో తరగతికి ప్రమోషన్ పొందాడు. అలా ప్రతి తరగతిలోనూ ఏ+ గ్రేడ్‌తో దూసుకెళ్లాడు.
నిబంధనల అడ్డంకి.. తండ్రి న్యాయపోరాటం : ఎనిమిదో తరగతి వరకు సాఫీగా సాగిన ఆరవ్ చదువుకు, తొమ్మిదో తరగతిలో చేరే క్రమంలో సీబీఎస్‌ఈ నిబంధనల రూపంలో అడ్డంకి ఎదురైంది. 11 ఏళ్ల వయసులో తొమ్మిదో తరగతిలో చేర్చుకోలేమని బోర్డు స్పష్టం చేసింది. దీంతో, కుమారుడి భవిష్యత్తు కోసం తండ్రి దిలీప్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. “నా కుమారుడి వయసు చిన్నదే అయినా, అతని మేధోశక్తి అసాధారణమైనది” అని కోర్టుకు విన్నవించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ముగ్గురు మనస్తత్వ నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆరవ్‌కు ఐక్యూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఆ పరీక్షల్లో ఆరవ్‌కు సాధారణ పిల్లల కంటే ఎంతో ఎక్కువ ఐక్యూ ఉన్నట్లు నిపుణులు ధ్రువీకరించారు. దీంతో, సీబీఎస్‌ఈ ప్రత్యేక అనుమతి మంజూరు చేయక తప్పలేదు.
సివిల్స్యే లక్ష్యం.. యూట్యూబ్‌లో పాఠాలు : “మా అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైంది. నాకు మ్యాథ్స్, సైన్స్ అంటే చాలా ఇష్టం. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా 9, 10 తరగతుల విద్యార్థులకు గణితం బోధిస్తున్నాను. భవిష్యత్తులో ఐఐటీలో చదివి, సివిల్ సర్వీసెస్‌లో చేరి దేశానికి సేవ చేయాలన్నదే నా లక్ష్యం,” అని ఆరవ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. తన మేధస్సుతో నిబంధనలనే సవాలు చేసి, న్యాయపోరాటంలో గెలిచిన ఈ బాల మేధావి కథ ఎందరికో స్ఫూర్తిదాయకం.


