Justice Verma faces setback in currency bundles case: నగదు కట్టల కేసులో సుప్రీంకోర్టు విచారణ కమిటీ నివేదికను సవాలు చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2025 మార్చిలో జస్టిస్ వర్మ ఢిల్లీలోని అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నప్పుడు ఇంట్లో పెద్ద మొత్తంలో పాక్షికంగా కాలిపోయిన నగదు కట్టలు లభించాయి. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ సుదీర్ఘ విచారణ అనంతరం తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో, జస్టిస్ వర్మ నివాసంలో నగదు కట్టలు లభించిన విషయం నిజమేనని, ఆ డబ్బు ఆయన లేదా ఆయన కుటుంబ సభ్యుల అధీనంలోనే ఉందని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి సిఫార్సు చేశారు.
దీంతో జస్టిస్ వర్మ విచారణ నివేదికను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ, విచారణ కమిటీ నివేదికను సమర్థించింది.
ప్రస్తుతం పార్లమెంట్‌లో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఎంపీల నుంచి సంతకాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
జస్టిస్ వర్మ కేసు: పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం
ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం అనంతరం పెద్ద మొత్తంలో నగదు కట్టలు లభించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కొలిజియం అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీ దర్యాప్తులో ఆ నగదు జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల అధీనంలోనే ఉన్నట్లు నిర్ధారించింది. దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వడంలో జస్టిస్ వర్మ విఫలమయ్యారని కమిటీ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా, ఆయనను అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించాలని ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలిజియం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలంటూ లోక్‌సభలో ఎంపీలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై 145 మంది ఎంపీలు సంతకాలు చేశారు. తాజా పరిణామాలతో ఈ కేసు ఇంకా ఎటు వెళ్తుందోనన్న ఉత్కంఠ రేపుతోంది.


