Wednesday, June 11, 2025
Homeనేషనల్Kamal Haasan: రాజ్యసభకు ఏకగ్రీవంగా కమల్ హాసన్ ఎన్నిక

Kamal Haasan: రాజ్యసభకు ఏకగ్రీవంగా కమల్ హాసన్ ఎన్నిక

లోక నాయకుడు, మక్కల్‌ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తమిళనాడు రాష్ట్రం నుంచి పెద్దల సభ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో అధికార డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం కమల్ పార్టీకి రాజ్యసభ స్థానం కేటాయించారు. ఇటీవలే ఆయన నామినేషన్ వేశారు. ఈ స్థానానికి కమల్ మినహా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఇక నామినేషన్ సందర్భంగా కమల్ ప్రకటించిన ఆస్తులు చర్చనీయాంశంగా మారాయి. అఫిడవిట్ ప్రకారం ఆయన వద్ద మొత్తం రూ. 305.55 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. అందులో రూ.245.86 కోట్లు స్థిరాస్తులైతే, రూ.59.69 కోట్లు చరాస్తులుగా నమోదు చేశారు. ప్రముఖ నగరాల్లో కమర్షియల్ బిల్డింగ్‌లు నాలుగు ఉండగా, వాటి మొత్తం విలువ రూ.111.1 కోట్లు. వ్యవసాయ భూమి విలువ రూ.22.24 కోట్లుగా వెల్లడించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఆయన ఆదాయం రూ.78.9 కోట్లుగా నమోదైంది. అలాగే కలమ్ వద్ద బెంజ్, BMW, లెక్సస్, మహీంద్రా వంటి బ్రాండ్‌లకు చెందిన నాలుగు కార్ల విలువను రూ.8.43 కోట్లుగా లెక్కించారు. ఇక కమల్ హాసన్‌కి మొత్తం రూ.49.67 కోట్లు అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల కమల్ ప్రధాన పాత్రలో నటించిన ‘థగ్ లైఫ్‌'(Thuglife) జూన్ 5వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజైన రోజే మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. కమల్ గత సినిమాల కన్నా ఈ సినిమాకే తక్కువ ఓపెనింగ్స్ రావడం గమనార్హం. దీంతో ఆయన కెరీర్ లోనే మరో భారీ డిజాస్టర్ గా మూవీ మిగిలిపోయింది. దాదాపు 37 ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబోలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మూవీ యూనిట్ తీవ్ర నిరాశలో ఉంది. కాగా ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, నాజర్, తనికెళ్ల భరణి, అశోక్ సెల్వన్, మహేశ్ మంజ్రేకర్ వంటి ప్రముఖ నటులు నటించగా.. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News