Landslide Hits Bus in Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. బిలాస్‌పూర్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడి ఒక ప్రైవేట్ బస్సు శిథిలాల కింద పూర్తిగా కూరుకుపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 18 మంది మరణించారు. బస్సులో ప్రయాణిస్తున్న అనేకమంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బిలాస్‌పూర్ జిల్లాలోని బల్లూ వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడడంతో భారీ రాళ్లు మట్టి పెళ్లలు బస్సుపై ఒక్కసారిగా పడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురిని, ఒక చిన్నారిని సహా నలుగురు ప్రయాణికులను రక్షించారు. అయితే, ప్రమాద సమయంలో బస్సులో 30-35 మంది ఉన్నట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్న విషయం తెలిసిందే.
సహాయక చర్యలు ముమ్మరం..
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్, విపత్తు నిర్వహణ సంస్థ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. జేసీబీ యంత్రాల సాయంతో శిథిలాలను తొలగించే పనిని వేగవంతం చేశాయి. బస్సు మారోటన్–కలావుల్ మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు బస్సు పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/alligations-on-jubileehills-mla-candiadte-race-naveen-yadav/
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి సంతాపం
ఈ ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. “హిమాచల్‌ప్రదేశ్ బిలాస్‌పూర్ జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయా కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాధించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. ప్రభుత్వ తరఫున సహాయక చర్యలు ముమ్మరం చేశాం.” అని ప్రధాని ట్విట్టర్ (X) ద్వారా తెలియజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అయితే, హర్యానాలోని రోహ్‌తక్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ఘుమర్విన్‌కు బయలుదేరిన ప్రైవేటు టూరిస్టు బస్సులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఝండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బలూఘాట్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో వాహనం పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయింది.


