Saturday, May 4, 2024
Homeనేషనల్BJP in Tamilnadu: తమిళ ఓట్లను బీజేపీ ఆకట్టుకుంటుందా?

BJP in Tamilnadu: తమిళ ఓట్లను బీజేపీ ఆకట్టుకుంటుందా?

చిన్న పార్టీలతోనే ..

తమిళనాడులో బీజేపీ పాగా వేయగలిగితే ఇక ఆ పార్టీకి దేశంలోనే తిరుగుండదు. ఇది అంత సులువైన వ్యవహారం కాదు. ఈ రాష్ట్రం మీద బీజేపీ నాయకత్వానికి శ్రద్ధ పెరిగినప్పటికీ, తమిళులకు బీజేపీ నాయకత్వం మీద శ్రద్ధాసక్తులు పెరగడం మాత్రం అంత త్వరగా సానుకూల పడే వ్యవహారం కాదు. ఉత్తర
భారతదేశమన్నా, హిందీ అన్నా తీవ్ర వ్యతిరేకతను కనబరచే తమిళుల మనసులో బీజేపీ స్థానం సంపాదించుకోవడానికి మరికొన్ని సంవత్సరాలు ఆగాల్సి ఉంటుంది. అనేక సర్వేలు, అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

- Advertisement -

మేలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ 370 స్థానాలను సంపాదించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో సొంతంగా 303 స్థానాలు చేజిక్కించుకున్న బీజేపీ పార్లమెంటులో తమ బలాన్ని మరింతగా మెరుగుపరచుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. నిజానికి ఆ 370 స్థానాల లక్ష్యం నెరవేరినా నెరవేరకపోయినా, ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడడానికి మాత్రం బాగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దక్షిణ భారతదేశంలో కూడా అది కొన్ని సీట్లు సంపాదించుకుంటే తప్ప అది ఆశించిన స్థాయిలో తన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేదు. ఒక్క కర్ణాటకలో తప్ప మరే దక్షిణాది రాష్ట్రంలోనూ అది ఇంతవరకూ తన పరిస్థితిని మెరుగు పరచుకోవడం సాధ్యం కాలేదు. స్థానికంగా ఏదో ఒక పార్టీతో పొత్తుకుంటే తప్ప ఒక్క సీటు కూడా గెలవలేని స్థితిలో ఉన్న బీజేపీ ఈసారి తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అణ్ణామలైని అడ్డం పెట్టుకుని తమిళనాడులో కొన్నయినా స్థానాలు సంపాదించాలని పట్టుదలగా ఉంది.

తమిళనాడులో కొన్ని స్థానాలు సంపాదించుకోవాలనే లక్ష్యంతో పాటు, తాము కేవలం ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన పార్టీ అనే ముద్ర నుంచి బయటపడాలని కూడా అది భావిస్తోంది. ఉత్తర భారతదేశంలో ఒక బలమైన పార్టీగా ఎదుగుతున్న సమయంలో కూడా బీజేపీ దక్షిణ భారతదేశంలో నామరూపాలు లేని పరిస్థితిలోనే ఉంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి, దాని మిత్రపక్షమైన పి.ఎం.కెకి
తలా ఒక స్థానం లభించింది. జయలలిత నాయకత్వంలోని అన్నా డిఎంకె అత్యధిక స్థానాలు సంపాదించడం, ఆ దెబ్బకు డిఎంకె సైతం చతికిలపడిపోవడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 39 సీట్లకు ఒంటరిగా పోటీ చేసిన అన్నాడిఎంకె 37 స్థానాలను చేజిక్కించు కోగలిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్
రాధాకృష్ణన్ కన్యాకుమారి నుంచి విజయం సాధించగా, పి.ఎం.కె అధినేత అంబుమణి రాందాస్ ధర్మపురి నుంచి గెలవడం జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి లభించిన ఓట్ల శాతం కేవలం 5.5 మాత్రమే. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోయింది. దాని మిత్రపక్షమైన అన్నాడిఎంకె నాయకుడు ఎళప్పాడి కె. పళని స్వామి మాత్రమే ఈ ఎన్నికల్లో గెలవగలిగారు. మిగిలిన సీట్లన్నిటినీ డి.ఎం.కె చేజిక్కించు కోగలిగింది. బీజేపీకి 3.66 ఓట్ల శాతం మాత్రమే దక్కింది.

కీలక సమస్యలు
తమిళనాడులో బీజేపీకి బలం పెరగడానికి ప్రధాన కారణాలు భాషా సమస్య, నాయకత్వ లేమి. బి.ఎస్. యడియూరప్ప కారణంగా కర్ణాటకలో ఈ పార్టీ కాస్తంత బలం పుంజుకోగలిగింది. భాష సమస్య లేని కారణంగా తెలంగాణలో కూడా కొద్దో గొప్పో తన ఉనికిని చాటుకోగలిగింది. అయితే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఈ పార్టీకి తన ఉనికిని చాటుకోవడం కూడా గగనమైపోయింది. ఎట్టకేలకు తమిళనాడులో కె. అణ్ణామలై రూపంలో ఒక సమర్థుడైన నాయకుడు లభ్యం కావడంతో బీజేపీలో ఆశాభావం మొలకెత్తింది. ఈ మధ్య కాలంలో అణ్ణామలై సాగిస్తున్న ప్రచారం పాలక డి.ఎం.కెకి ఒక పెద్ద సవాలుగా పరిణమించింది. ప్రజలకు అణ్ణామలై బాగా దగ్గర రావడం, డి.ఎం.కెని సవాలు చేయగల స్థాయికి చేరుకోవడం వల్ల ఈ మధ్య కాలంలో తమిళనాడులో కూడా బీజేపీ వార్తలు పతాక శీర్షికల్లో కనిపిస్తున్నాయి. అయితే, ఇది ఎంత వరకూ ఓట్ల రూపంలోకి మారుతుందన్నది మాత్రం వేచి చూడాల్సిన విషయం.

రాష్ట్రంలో నిద్రాణంగా ఉన్న బీజేపీని అణ్ణామలై జాగృతం చేసినప్పటికీ, ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుకూలతలు పెంచినప్పటికీ, 2019 నాటి కంటే బీజేపీ ఈ రాష్ట్రంలో మెరుగుపడుతుందన్న ఆశేమీ లేదు. అన్నాడిఎంకెతో పొత్తు లేకుండా పోటీ చేస్తున్నందువల్ల ఈ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం కూడా లేదని సర్వేలలో కూడా నిర్ధారణ అవుతోంది. అణ్ణామలై దూకుడు రాజకీయాల కారణంగానే గత ఏడాది అన్నాడిఎంకె ఎన్.డి.ఎ కూటమి నుంచి బయటకు రావడం జరిగింది. ఈసారి బీజేపీ రాష్ట్రంలోని కొన్ని చిన్నా చితకా పార్టీలతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా, అన్నాడిఎంకె నాయకులను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం కూడా చేస్తోంది. బీజేపీతో ఈ సారి పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడిఎంకె నాయకత్వం పదే పదే చెబుతూ వస్తోంది. బీజేపీ దీని మీద పూర్తిగా మౌనం వహించింది. తాము ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నామే తప్ప బీజేపీతో పొత్తు పెట్టుకునేది లేదని పళనిస్వామి స్పష్టంగా ప్రకటించారు.

ఫలించని ఎత్తులు
బీజేపీ తన వంతుగా చిన్నా పార్టీలతో పొత్తులు పెట్టుకుంటోంది. ఈ పార్టీతో మొట్టమొదటగా పొత్తు పెట్టుకున్న పార్టీ తమిళ మానిల కాంగ్రెస్. లోక్ సభ ఎన్నికలకు గాను ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది. పి.ఎం.కె కూడా ఈసారి బీజేపీతో పొత్తుపెట్టుకునే అవకాశం ఉంది. పి.ఎం.కెతో ఇప్పటికే అన్నాడిఎంకె పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. డి.ఎం.డి.కె అనే మరో పార్టీతో కూడా బీజేపీ పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. ఈ పార్టీతో కూడా అన్నాడిఎంకె చేతులు కలిపే ప్రయత్నం చేస్తోంది. ఈ పార్టీ నాయకుడైన విజయకాంత్ ను ఈ మధ్య నరేంద్ర మోదీ ప్రశంసించడం కూడా జరిగింది. దినకరన్ కు చెందిన ఏ.ఎం.ఎం.కెతోనూ, అన్నాడిఎంకె నుంచి బయటకు వచ్చేసిన పన్నీర్ సెల్వంతోనూ, పుదియ తమిళగం అనే మరో పార్టీతోనూ బీజేపీ పొత్తు కోసం ప్రయత్నాలు సాగిస్తోంది.

రాష్ట్రంలో తమ పార్టీ బలం ఏమిటన్నది పరీక్షించుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈసారి అన్నా డిఎంకెకి దూరంగా ఉంటూ కేవలం చిన్న పార్టీలతోనే చేతులు కలుపుతోంది. తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, తమకు పొత్తులు ముఖ్యం కాదని అణ్ణామలై ప్రకటించడం జరిగింది. అణ్ణామలై చేపట్టిన ఎన్ మణ్ ఎన్ మక్కళ్ (నా భూమి నా ప్రజలు) అనే నినాదం కారణంగా ఇప్పటికే బీజేపీ పట్ల ప్రజల మనోభావాల్లో మార్పు వస్తోంది. తమకు మద్దతు విస్తరిస్తున్నట్టు ఇటీవలి సర్వేల్లో తేలిందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఆర్. శేఖర్ ఇటీవల చెప్పారు. అన్నాడిఎంకెతో పొత్తు విచ్ఛిన్నం అయిన తర్వాత బీజేపీ ఓటు వాటా క్రమంగా పెరుగుతూ వస్తోందని, ప్రస్తుతం 15 శాతం వరకూ ఓటు వాటా ఉన్నట్టు సర్వేల్లో తెలిసిందని ఆయన వివరించారు. తమ పార్టీకి రామనాథపురం, తెన్ కాశి, శివగంగ, విరుధునగర్ తదితర ప్రాంతాల్లో బలం బాగా పెరిగిందని, ఈ నాలుగు లోక్ సభ స్థానాలను తాము గెలుచుకునే అవకాశం ఉందని
కూడా ఆయన వెల్లడించారు.

తమిళనాడులో ఇటీవల పర్యటన చేసిన నరేంద్ర మోదీ అన్నాడిఎంకె నాయకులైన ఎం.జి. రామ చంద్రన్, జయలలితలను ఎంతగానో కొనియాడారు కానీ, అన్నాడిఎంకెను ఎక్కడా విమర్శించ లేదు. ఆయన ఇక్కడకు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్, డిఎంకెలను మాత్రమే ఎండగట్టడం జరుగుతోంది. అన్నాడిఎంకె అభిమానుల ఓట్లను రాబట్టుకోవడానికే మోదీ ఆ పార్టీని విమర్శించడం లేదని, పైగా ఆ పార్టీ
నాయకులను ప్రశంసించడం జరుగుతోందని మీడియా వ్యాఖ్యానాలు చేస్తోంది. మోదీకి నాలుగైదు సార్లు తమిళనాడులో పర్యటించడం, అణ్ణామలై దూకుడుగా ప్రచారాలు చేయడం, చిన్నా చితకా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, ఇతర పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేయడం వగైరాలన్నిటి బట్టి, బీజేపీ తమిళనాడులో పాగా వేయడానికి ఏ అవకాశాన్నీ జారవిడుచుకోదలచుకోలేదని
అర్థమవుతోంది. బీజేపీ, మోదీ, అణ్ణామలైల ప్రయత్నాలకు, చేస్తున్న కృషికి ఎన్నికల ద్వారా తమిళనాడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారన్నది తేలిపోతుంది.

– ఎస్.కె. రంగారావు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News