MP Pabitra Margherita: అస్సాంకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ పబిత్రా మార్గెరిటా టీని భారతదేశ జాతీయ పానీయంగా ప్రకటించాలని సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. టీ చాలా మంది ప్రజల రోజువారీ జీవితంలో అంతర్భాగమని, దేశ పౌరులు తమ రోజును ఒక కప్పు టీతో ప్రారంభిస్తారని అన్నారు. “కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు,గుజరాత్ నుండి ఈశాన్య వరకు, ప్రతి ఇంటి వంటగదిలో టీ లభిస్తుంది. కాబట్టి దీనిని మన దేశ జాతీయ పానీయంగా ప్రకటించాలని ఆయన అన్నారు.
బ్రిటీష్ హయాంలో, గత 70 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో మనం ఎన్నో నష్టపోయాం. తేయాకు తోటల కార్మికుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఉండాలి. తేయాకు తోటల కార్మికులు మొత్తంగా అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక ప్యాకేజీని కూడా కోరిన ఆయన.. ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల మంది తేయాకు కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. 2023లో అస్సాం టీ 200వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందని కూడా ఈ బీజేపీ ఎంపీ సభలో పేర్కొన్నారు. “అసోం ప్రజలు ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటారు.
అస్సాంలోని తేయాకు పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్రం తన సహకారాన్ని అందించాలని నేను అభ్యర్థిస్తున్నాను” అని అన్నారాయన. టీ పేరుతో పలు రకాల టీ డ్రింక్స్ మార్కెట్లో లభిస్తున్నాయని.. దీంతో టీ పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని మార్గరీటా సభకు తెలియజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నానని ఆయన కోరారు. టీను జాతీయ పానీయంగా ప్రకటించాలన్న ఈ డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.