జమ్మూ కశ్మీర్‌లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ ఆపరేషన్ సిందూర్‌పై స్పందిస్తూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు చేపట్టిన ప్రతీకార దాడిని ఆమె స్వాగతించారు. ఈ ఆపరేషన్ మా కుటుంబం కోసం కాదు, దేశ భద్రత కోసం. ఇది నా భర్త లెఫ్టినెంట్ వినయ్ కలల్ని నెరవేర్చిందని హిమాన్షి అన్నారు.
తాజా ఆపరేషన్ ఉగ్రవాదంపై భారత గళం ఎలా మారిందో ప్రపంచానికి తెలియజేసిందని పేర్కొన్నారు. ఇది ప్రారంభం మాత్రమే. ఉగ్ర మూలాలను పూర్తిగా తుడిచిపెట్టే వరకు చర్యలు కొనసాగాలని అని ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
పహల్గాం దాడికి కొన్ని రోజుల ముందు వినయ్ నర్వాల్, హిమాన్షి నర్వాల్ పెళ్లి చేసుకుని హనీమూన్‌కు కశ్మీర్ వెళ్లారు. అదే సమయంలో జరిగిన ముష్కరుల దాడిలో వినయ్ సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం భర్త మృతదేహం పక్కన కూర్చుని విలపించిన హిమాన్షి చిత్రం దేశవ్యాప్తంగా హృదయాలు కలిచేసింది.
ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదం నిర్మూలనకు నాంది కావాలని, భవిష్యత్తులో మరో హిమాన్షి ఇలా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి రాకూడదని ఆమె హృదయాన్ని తాకేలా చెప్పారు. భారత జవాన్ల ధైర్యానికి, త్యాగానికి ఇది నిజమైన నివాళి అని హిమాన్షి భావోద్వేగంతో అన్నారు.