Prashanth Kishore Has Two Votes In Bihar: దేశవ్యాప్తంగా అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దిగిన సంగతి తెలిసిందే. ఆయన సొంత రాష్ట్రం బిహార్ అయినప్పటికీ పలు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు అధికారంలోకి తీసుకురావడానికి ఆయన పని చేశారు. జన్ సురాజ్ పార్టీని స్థాపించి 2025 బిహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనపై ఇప్పుడో వార్త హల్‌చల్ చేస్తోంది. ఆయన రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రశాంత్ కిషోర్ (పీకే) రెండు రాష్ట్రాల ఓటరు జాబితాల్లో తన పేరు నమోదు చేసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు తన సొంత రాష్ట్రం బీహార్‌లోని ఓటరు జాబితాలో కూడా ప్రశాంత్ కిషోర్ పేరు ఉంది. ఈ అంశం బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ వివాదాన్ని రేకెత్తిస్తోంది. బీహార్ రోహతాస్ జిల్లాలో ఉన్న తన పూర్వీకుల గ్రామమైన కోనార్ పరిధిలోని కర్గహర్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటరు జాబితాలో కిషోర్ పేరు నమోదైంది. ఇక్కడి పోలింగ్ స్టేషన్ వివరాలు కూడా ఉన్నాయి. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న భబానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓటరు జాబితాలో ఆయన పేరు ఉంది. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి రాజకీయ సలహాదారుగా పనిచేశారు.
గతంలో బెంగాల్ ఓటరుగా నమోదు..
ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 17 ప్రకారం, ఏ వ్యక్తి కూడా ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల ఓటరు జాబితాలో నమోదు కావడానికి అనర్హులు. ఈ నేపథ్యంలో, ప్రశాంత్ కిషోర్ రెండు రాష్ట్రాల్లో ఓటరుగా నమోదు కావడంపై దుమారం రేగింది. అయితే, ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత కిషోర్ బీహార్‌లోని కర్గహర్‌లో ఓటరుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. బెంగాల్ ఓటరు జాబితా నుంచి తన పేరును తొలగించాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారని, కానీ ఆ అప్లికేషన్ స్టేటస్ తమకు తెలియదని ఆ నాయకుడు చెప్పుకొచ్చాడు. కాగా, బీహార్‌లో ప్రశాంత్ కిషోర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్(మహాకూటమి) రాబోయే ఎన్నికల్లో ఓటమిపాలై మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. తాము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో మహాకూటమి మూడవ స్థానంలో ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్‌డీఏ, జన్ సురాజ్ మధ్యనే ఉంటుందన్నారు. గత ఐదు రోజుల్లో తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనల్లో అస్సలు అర్థం లేదని, వీటిపై ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు.


