పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో.. దీన్ని కీలకమైన పరిణామంగా అభివర్ణించారు. వక్ఫ్ వ్యవస్థలో అనేక దశాబ్దాలుగా పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయని, తాజా బిల్లు ఆమోదం వల్ల అట్టడుగున ఉన్న వర్గాలకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని పేర్కొన్నారు. మోదీ తన ట్వీట్‌లో, “పార్లమెంట్ ఉభయ సభలు వక్ఫ్ (సవరణ) బిల్లు మరియు ముస్సల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లును ఆమోదించడం ఎంతో ముఖ్యమైన ముందడుగన్నారు. ఇది సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమానమైన అభివృద్ధికి దారి తీస్తుందని తెలిపారు. ముఖ్యంగా, ఇలాంటి నిర్ణయాలు అట్టడుగున ఉన్న ప్రజలకు మేలు చేస్తాయని తెలిపారు.
రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. దీని కోసం 12 గంటల పాటు విస్తృత చర్చ జరిగింది. చివరికి, 128 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేయగా, 95 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ప్రతిపక్ష సభ్యులు బిల్లులో కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఉభయ సభల్లో సులభంగా ఆమోదం పొందడం గమనార్హం. బుధవారం, లోక్‌సభలో కూడా దీని పై 14 గంటలకు పైగా చర్చ జరిపారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించగా, 288 మంది బిల్లుకు అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు.
బిల్లు ఆమోదంపై ముస్లింల అభ్యంతరాలపై మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, ఈ బిల్లుతో ముస్లింలకే మేలు జరుగుతుంది. ముస్లిమేతరులు వక్ఫ్ ఆస్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశమే ఉండదని స్పష్టం చేశారు. ఈ బిల్లు మతపరమైనది కాదని, వాస్తవానికి వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పెంచడమే దీని ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగానే ఇది చట్టంగా మారి అమల్లోకి రానుంది.