IPL Unsold, Yet Broke Chris Gayle’s Records : IPL మెగా వేలం చాలా మంది క్రికెటర్లకు ఒక ఆశాకిరణం కానీ, కొందరికి మాత్రం అది ఊహించని నిరాశను మిగిల్చింది. అచ్చం అలాంటి చేదు అనుభవమే న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఫిన్ అలెన్‌కు ఎదురైంది. రూ. 2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో బరిలోకి దిగినా, ఏ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు..దీంతో ఐపీఎల్ 18వ సీజన్‌కు అతను దూరమయ్యాడు. ఆ క్షణాన కలిగిన నిరాశ, బహుశా అతనిలోని కసిని రెట్టింపు చేసిందేమో తెలియదు కానీ… IPL అన్‌సోల్డ్ అనే అపవాదును చెరిపేసుకునే అవకాశం మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 రూపంలో అతడికి దొరికింది. దొరికిన అవకాశాన్ని ఫిన్ అలెన్ ఎలా సద్వినియోగం చేసుకున్నాడంటే… ఏకంగా T20 క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డులను తిరగరాసి, “యూనివర్సల్ బాస్” క్రిస్ గేల్ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. తన విధ్వంసకర ఆటతీరుతో తన సమర్థతను ప్రపంచానికి చాటి చెప్పాడు.
బ్యాటింగ్ విశ్వరూపం :
అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 టోర్నీ గురువారం గ్రాండ్‌గా మొదలైంది. తొలి మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ తలపడగా, ఫిన్ అలెన్ బ్యాటింగ్ విశ్వరూపం చూపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో, అలెన్ విధ్వంసంతో 20 ఓవర్లలో 269 పరుగుల భారీ స్కోరు చేసింది.
T20 చరిత్రలోనే అరుదైన రికార్డులు :
ఫిన్ అలెన్ బ్యాటింగ్‌కు దిగగానే బౌలర్లను పరుగులు పెట్టించాడు. కేవలం 34 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని లీగ్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును సృష్టించాడు. గతంలో ఈ రికార్డు నికోలస్ పూరన్ (40 బంతులు) పేరిట ఉండేది. అంతేకాదు, అలెన్ కేవలం 49 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని చేరుకుని, T20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ అరుదైన రికార్డు గతంలో “యూనివర్సల్ బాస్” క్రిస్ గేల్ (62 బంతులు) పేరిట ఉండేది. గేల్ 2013 ఐపీఎల్‌లో పూణేపై 175 పరుగులు చేసినప్పుడు 62 బంతుల్లో ఈ మార్కును అందుకున్నాడు. ఫిన్ అలెన్ ఏకంగా 13 బంతుల్లోనే గేల్ రికార్డును అధిగమించడం అతని బ్యాటింగ్ పరాక్రమానికి నిదర్శనమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలెన్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు మాత్రమే ఉండగా, ఏకంగా 19 సిక్స్‌లు బాదడం విశేషం. ఇది ఒక T20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా మరో రికార్డు. ఈ క్రమంలో కూడా క్రిస్ గేల్ (18 సిక్స్‌లు) రికార్డును అలెన్ అధిగమించాడు. అతని స్ట్రైక్ రేట్ 296.08గా నమోదైంది.
కేవలం మెరుపు ఇన్నింగ్స్ మాత్రమే కాదు :
ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ అయినప్పటికీ, ఫిన్ అలెన్ MLCలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇది కేవలం ఓ మెరుపు ఇన్నింగ్స్ మాత్రమే కాదు, నిరాశను స్ఫూర్తిగా మలుచుకుని అద్భుతాలు చేయొచ్చని అలెన్ అతని ఆటతీరుతో నిరూపించాడు అనడానికి నిదర్శనం. 270 పరుగుల లక్ష్య ఛేదనలో వాషింగ్టన్ తేలిపోయింది. 13.1 ఓవర్లలోనే 146 పరుగులకే ఆలౌటైంది.


