Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్MCD Elections: ఫ్లాష్ మాబ్స్, రాక్ కన్సర్ట్స్, డీజే, స్టార్ క్యాంపెయినర్స్..పోస్టర్ బాయ్ మోడీని మేయర్...

MCD Elections: ఫ్లాష్ మాబ్స్, రాక్ కన్సర్ట్స్, డీజే, స్టార్ క్యాంపెయినర్స్..పోస్టర్ బాయ్ మోడీని మేయర్ చేస్తారా!

ఎన్నికలు ఏవైనా వాటిలో గెలవటమే తమ ఏకైక టార్గెట్ గా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. జాతీయ, రాష్ట్ర, స్థానిక ఎన్నికలు ఏవైనా ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీకి సర్వం ఒడ్డడం మాత్రమే తెలుసు. ఇది మాత్రమే బీజేపీ ‘రణతంత్రం’గా మారింది. అందుకే ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ వ్యూహంలో మునిగి తేలటాన్ని కమలనాథులు పనిగా పెట్టుకుని గత 7 ఏళ్లుగా బిజీగా ఉంటున్నారు.

- Advertisement -

ఫ్లాష్ మాబ్స్, రాక్ కన్సర్ట్స్, డీజే.. ఇవి ఇప్పుడు ఢిల్లీ మహానగరాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే వాయు కాలుష్యంతో వణికిపోతున్న న్యూ ఢిల్లీలో ఇప్పుడు శబ్ద కాలుష్యం కూడా దద్దరిల్లేలా చేస్తోందన్నమాట.

“మోడీజీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ” అంటూ బీజేపీ నినదిస్తూ దేశ రాజధానిలో ఒకటే హంగామా చేస్తోంది. “ఈబోటి స్థానిక ఎన్నికలకు కూడా మోడీనే కావాలా”? అంటూ కాంగ్రెస్, ఏఏపీ వాగ్భాణాలు సంధిస్తున్నాయి. ఢిల్లీ నగరాభివృద్ధికి బీజేపీ ఏమైనా చేసి ఉంటే చెప్పుకుని ఓట్లు అడిగేది కానీ అలాంటిదేం లేనందునే ఇలా మున్సిపల్ ఎన్నికలకు ప్రధాని ఇమేజ్ వాడుకునే దౌర్భాగ్యంలో బీజేపీ ఉందనే ఘాటు విమర్శలు చేస్తున్నాయి కాంగ్రెస్, ఆప్ పార్టీలు.

వచ్చే నెల జరుగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు స్టార్ క్యాంపెయినర్స్ తో ప్రచార హోరును నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తున్నాయి. ఇక వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉండనే ఉన్నారు. వీరు కూడా పార్టీ ప్రచారాల్లో తళుక్కుమంటున్నారు. ఇక్కడి రాజకీయ వేడి చూస్తుంటే బహుశా దేశంలో ఏ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ రేంజ్ లో పోటీ జరగలేదనిపిస్తుంది. ఆఖరుకి అత్యంత ఆసక్తికరంగా సాగే ప్రతిష్ఠాత్మకమైన బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఎంసీడీ ఎన్నికల ముందు దిగదుడుపే అన్న స్థాయిలో ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.

కేంద్ర స్థాయిలో మోడీ సర్కారు సాధించిన విజయాలన్నీ ఏకరువు పెడుతూ ఢిల్లీ వాసులకు షాక్ ఇస్తున్నారు కమలనాథులు. “ఇదేంటి, మున్సిపల్ ఎన్నికలు, సిటీ గురించి మాట్లాడకుండా మోడీ సర్కారు విజయాలను వల్లిస్తున్నారం”టూ ఢిల్లీ నగర ప్రజలు ఆశ్చర్యపోతున్నా ఇవన్నీ పట్టించుకునే స్థితిలో బీజేపీ శ్రేణులు లేకపోగా మోడీ మేనియాలో కూరుకుపోతుండటం విశేషం. ఇక్కడ కూడా మోడీ మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ పార్టీకి ఏకైక దిక్కుగా, వ్యక్తి పూజను పీక్స్ కు తీసుకెళ్తుండటం విశేషం. ‘మోడీ మోడల్’ ను ప్రజల వద్దకు తీసుకెళ్లటంలో తప్పేం లేదు, “ఆయన మా పార్టీ నేత, ప్రధానిగా ఎంతో సాధించారు మేం చెప్పుకోవద్దా”? అంటూ బీజేపీ ఢిల్లీ పెద్దలు తమ విధానాలను సమర్థించుకుంటూ ఉండటం ఇక్కడ అసలు విషయం.

“ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి తమ పార్టీకి చెందిన మోడీ కావటంతోనే ఇలా ప్రతి ఎన్నికల్లోనూ తాము మోడీ ఇమేజ్ ను తప్పకుండా వాడుకుంటా”మని పార్టీ నేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఇక ఢిల్లీ కార్పొరేషన్ విషయాలకు వస్తే 2007 నుంచి బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంది. అయినా అవేవీ బీజేపీ ఇక్కడ టమకు వేసుకోకపోవటం మనమంతా గమనించాల్సిన విషయం.

ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీకి ఈ ఏడాది గట్టి పోటీ ఎదురవుతోంది. ఓవైపు పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఏఏపీ తమ ‘పార్టీ పోస్టర్ బాయ్’గా ప్రయోగిస్తుంటే మరోవైపు బీజేపీ తన ‘పోస్టర్ బాయ్’ గా మోడీ ఇమేజ్ ను ప్రయోగిస్తోంది. ఇప్పటికే బీజేపీ తన మంత్రాంగాన్ని, యంత్రాగాన్నంతా ప్రచార రంగంలోకి దించగా దేశంలోని పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని సీఎంలు కూడా ఢిల్లీకి క్యూ కట్టి మరీ ప్రచారం చేస్తున్నారు.

ఈ ఆదివారం కనీసం నలుగురు బీజేపీ చీఫ్ మినిస్టర్లు ఢిల్లీ మహానగరంలో కలియదిరుగుతూ ప్రచారాన్ని హై ఓల్టేజ్ పొలిటికల్ డ్రామాగా ఆద్యంతం కొనసాగించారు. అస్సాం సీఎం హిమంతా బిశ్వా శర్మ, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ఈ ప్రచారంలో పాలుపంచుకున్నారు. ఇంకా చాలా మంది నేతలు ఈ ప్రచారంలో పాల్గొని కాషాయ జెండాను గడపగడపకూ మోసుకెళ్లే పనిలో ఉన్నారు. ఇందుకు పకడ్బందీ ప్రచార కార్యక్రమాలను రూపొందించారు. ప్రధాన కూడళ్లు, ప్రాంతాల్లో వీరు మరిన్ని రోడ్ షోలు కూడా చేయనున్నారు. బహిరంగ సభలు ఎలాగూ నిర్వహిస్తారు. మరోవైపు సోషల్ మీడియాలో ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు మారుమోగిపోతున్నాయి.

బీజేపీ క్యాంపెయిన్ సాంగ్ పై వచ్చిన విమర్శలు గతంలో ఎన్నడూ ఏ పార్టీ గీతాలపైనా రాలేదని ఇక్కడ చెప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వాడవాడలా బీజేపీ ప్లే చేసే పార్టీ ప్రచార పాటలో మోడీ పేరు కనీసం 50 సార్లకు తగ్గకుండా వినిపిస్తోంది. అంతేకాదు 6 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో మోడీ సఫాయి కార్మికుల కాళ్లు కడగటం, విదేశీ పర్యటనలు, వివిధ ప్రారంభోత్సవాలు భారీ ఎత్తున కనిపిస్తాయి. ప్రధాని పంపిణీ చేసిన కోవిడ్ టీకాల విషయాన్ని కూడా ఈ ప్రచార పాటలో ప్రయోగించారు.

ఢిల్లీ గల్లీల్లో ఒకటే చక్కర్లు కొడుతున్న ప్రచార రథాల గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవి రోడ్ షోలల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిపైన కూడా అతి భారీ హోల్డింగ్స్ గా మోడీ ఇమేజెస్ ఉంటున్నాయి. వీటితోపాటు “నుక్కడ్ నాటక్స్” పేరుతో ఫ్లాష్ మాబ్స్ ను భారీ ఎత్తున నిర్వహిస్తోంది బీజేపీ. లోకల్ రాక్ బ్యాండ్స్ ఆధ్వర్యంలో ఇవి గమ్మతుగా సాగుతున్నాయి. యువ ఓటర్లు, ఫస్ట్ టైం ఓటర్లను ఇవి బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ అరాచకాలు, వైఫల్యాలను ఎండగట్టేలా ర్యాప్, పాప్ సాంగ్స్ ప్రముఖంగా వినిపిస్తున్నట్టు ఢిల్లీ బీజేపీ నేతలు వివరిస్తున్నారు. ఇందుకోసం కాషాయపార్టీ చేసిన కసరత్తు ఏమిటో తప్పకుండా తెలుసుకోవాలి. 63 డ్రామా కంపెనీలను కొన్ని నెలలపాటు ఆడిషన్ కు పిలిచిన పార్టీ వీరిలో 28 బెస్ట్ కంపెనీలను మాత్రమే ఎంపిక చేసి, ప్రచార రంగంలోకి దించింది. వీరంతా నగరంలో మొత్తం 2,500 నాటకాలను ప్రదర్శించనున్నారు. వీరికి సుమారు ఓ 10 థీములను పార్టీనే ఇచ్చింది. మొత్తం 250 వార్డుల్లోనూ ఇవి నిరంతరం థియేటర్ షోలను లైవ్ లో చేసి చూపిస్తాయి. ఇక ఈ డ్రామా కంపెనీల్లో పనిచేసే ఆర్టిస్టుల వయసు 18-30 లోపే ఉండటం మరో హైలైట్. ఈ హంగామాను చూసి విస్తుపోతున్న కాంగ్రెస్ పార్టీ.. “ఏంటిది మీరు మోడీని ప్రధానిగా కొనసాగిస్తారా లేక ఎంసీడీ మేయర్ ను చేసేస్తారా” ? అని ప్రశ్నిస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది.

రాజధాని, మెట్రోపాలిటన్ సిటీ అయిన ఢిల్లీని “మినీ ఇండియా”గా భావిస్తారు. దేశం నలుమూలలకు చెందిన ప్రజలు ఇక్కడ సెటిలర్స్ గా ఉన్నారు. దీంతో అన్ని రాష్ట్రాల నేతలకు ఇక్కడ ఎంతోకొంత కనెక్షన్, ప్రజాకర్షణ ఉంటుందన్న కారణంతో ఇలా తమ మంది మార్బలాన్ని బీజేపీ ప్రయోగిస్తూ, ఓటర్లను ఆకట్టుకునటంలో తలమునకలై ఉంది.

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్న కమలనాథులు ఎలాగైనా ఎంసీడీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించేందుకు అహర్నిశం శ్రమిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స్థాయికంటే ఎక్కువ ప్రధాన్యత ఇవ్వటం ద్వారా ఎంసీడీలో తమ పార్టీ జెండా ఎగురవేసి వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడాలనేది బీజేపీ ప్రధాన లక్ష్యం. ఆప్ ను దెబ్బతీయాలంటే ఇదే మంచి ఛాన్స్ అని, ఢిల్లీలో కేజ్రీవాల్ అనుచరులను మరింత నైతికంగా దెబ్బ తీసే పనిలో మోడీ, షా ద్వయం పెద్ద స్కెచ్ లు వేస్తోందని ఓవైపు ఢిల్లీ మీడియా కోడైకూస్తోందికూడా.

ఈనెల 27 నుంచి బీజేపీ చేయబోయే చివరి దశ ప్రచార హోరు ‘న భూతో న భవిష్యసి’ అన్నట్టు ఉంటుందని ఇప్పటికే బీజేపీ అధికారికంగా ప్రకటించింది. కనీసం 10 మంది స్టార్ క్యాంపెయినర్స్ కు తగ్గకుండా, వివిధ ప్రాంతాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆరోజు నుంచి బరిలోకి దించనున్నట్టు బీజేపీ వెల్లడించింది. ఇప్పటికే లక్ష మంది పార్టీ వర్కర్లు ఇంటింటా ప్రచారంలో మునిగిపోయారు. కోటి మందికి పైగా ఉన్న ఢిల్లీ ఓటర్లను కలుసుకుంటూ నిత్యం కేంద్ర మంత్రులు తమ ప్రభుత్వ విధానాలు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఉదయం 8 గంటలకే స్టార్ట్ అయి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతున్నాయి.

సుమారు ఒకటిన్నర కోటి మంది ఓటర్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎటువంటి తీర్పు ఇస్తారనే ఆసక్తి దేశవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే మనందరికీ ఢిల్లీ నగరంతో ఏదో ఒక లింక్ ఉండనే ఉంటుంది. ఇక ఈసారి రికార్డు స్థాయిలో మహిళా అభ్యర్థులు తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా బీజేపీ, ఆప్ లు మహిళా అభ్యర్థులను పెద్ద ఎత్తున పోటీకి దించాయి. ఎంసీడీ బరిలో మొత్తం 2,021 అభ్యర్థులుండగా.. 1,462 మంది మహిళా అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో ఆప్ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగా కాంగ్రెస్ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ అత్యధిక మంది అభ్యర్థులను దించగా, ఆప్, కాంగ్రెస్, బీఎస్పీ, జేడీయూ, ఏఐఎంఐఎం, సీపీఐఎం అభ్యర్థులు ఎంసీడీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈసారి బీజేపీ-ఆప్ మధ్య హోరాహోరీగా ఎన్నికలు రంజుగా సాగుతున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే వీరు పెద్దగా ఊసులోనే లేరు. దీంతో యథావిధిగా వీరు మూడవ స్థానంతో సరిపెట్టుకుంటారనే అంచనాలు వినిపిస్తున్నాయి. షీలా దీక్షిత్ స్థాయి వ్యక్తులు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి లేకపోవటం పార్టీకి పెద్ద మైనస్ గా మారింది.

ఎన్నికలంటేనే తమ బలాన్ని చాటుకోవటం, సంఖ్యా పరంగా నెగ్గటం, అధికారాన్ని చేజిక్కించుకోవటం ..మరి ఆ అవకాశాన్ని జారవిడుచుకుంటే క్షేత్రస్థాయిలో పట్టు పోదూ! పైగా గ్రౌండ్ లెవెల్ లో బీజేపీ జెండా మోసేవారికి కూడా ఎప్పుడూ ఏదో ఒకే ఛాలెంజ్ ముందుండాలి. ఎప్పటికప్పుడు రాజకీయ క్షేత్రంలో తమదే పై చేయి అని చాటుకుంటూ ఉంటేనే కార్యకర్తల్లో నిత్యం ఉత్సాహం పుట్టుకొస్తుంటుంది. తమ అజెండాని మోసేవారికోసమైనా ఎన్నికల్లో సత్తా చాటేందుకు శ్రమ పడి తీరాల్సిందే. ఎన్నికల్లో పోటీ చేయటం అనేది రాజకీయ పార్టీలకున్న అతి పెద్ద కర్తవ్యం కూడానూ. రైతులు ‘క్రాప్ హాలిడే’ ఇచ్చినట్టు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే కుదరదు. ఈ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ చతికిల పడుతూ వస్తోంది. ఇదే విషయంపై హై కమాండ్ కు ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధిష్ఠానంలో మార్పు రాకపోవటంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు స్తబ్దుగా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News