Monday, June 16, 2025
HomeNewsThe first female driver of TGSRTC : తొలి మహిళా బస్ డ్రైవర్...

The first female driver of TGSRTC : తొలి మహిళా బస్ డ్రైవర్ కథ

TGSRTC’s pioneering woman driver : పుడమి నుంచి ఆకాశపు అంచుల దాకా, ప్రతి అడుగులోనూ, ప్రతి రంగంలోనూ స్త్రీ తన చరిత్రను లిఖిస్తుంది. సాంప్రదాయ సంకెళ్లను తెంచుకుని మహిళలకు అసంభవం అనే రంగాల్లో సంభవం అని చాటిచెప్తున్నారు. అలాంటి ఓ అద్భుత ఘట్టమే మన తెలంగాణ నేలపైన చోటు చేసుకుంది. టీజీఎస్‌ఆర్టీసీ తొలి మహిళా బస్ డ్రైవర్‌గా సరిత రాష్ట్ర రవాణా రంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ నాంది ప్రతి ఆడబిడ్డకూ ఆదర్శం. ఇంతకీ సరిత ఎవరు..? డ్రైవర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది.? ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

తండ్రికి చేదోడుగా నిలబడాలనే తపనతో..
యాదాద్రి భువనగిరి జిల్లా, సీత్య తండాకు చెందిన వాంకుడోతు సరిత జీవితం కష్టాలతో నిండింది. ఆరుగురు సంతానంలో ఐదో అమ్మాయి అయిన సరిత, నలుగురు అక్కల పెళ్లిళ్ల కోసం తండ్రి భూమిని కోల్పోవడంతో పదో తరగతిలోనే చదువు మానేసింది. కుటుంబ పోషణకు సాయపడేందుకు, బావ వద్ద ఆటో నడపడం నేర్చుకుంది. బావ అకాల మరణంతో, తల్లిదండ్రులు, తమ్ముడితో పాటు అక్క బాధ్యతను కూడా సరిత భుజాన వేసుకుని, దేవరకొండలో కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్‌గా మారింది.

సవాళ్లను అధిగమించి డ్రైవర్‌గా సరిత ప్రస్థానం :
ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆకతాయిల వేధింపులతో విసిగిపోయిన సరిత, తన ఆహార్యాన్ని మార్చుకుని పురుషుడిలా జుట్టు కత్తిరించి, ప్యాంటు-షర్టు ధరించింది. ఆత్మవిశ్వాసంతో పదో తరగతి పాసై, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. 2010లో నల్లగొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేయగా, మహిళల నుంచి వచ్చిన ఏకైక దరఖాస్తు ఆమెదే. అయితే, అధికారులు ఆమె దరఖాస్తును మొదట తిరస్కరించినా, సరిత తన పట్టుదలతో కలను నిజం చేసుకోవడానికి మరింత దృఢంగా ప్రయత్నించింది.

ప్రముఖుల నుంచి ప్రశంసలు : ఉమెన్ అచీవర్స్ అవార్డు
సరిత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాల కొన్నేళ్లు బస్సును నడిపారు. ఆ తర్వాత 2014లో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (DTC)లో డ్రైవర్‌గా ఎంపికై, దేశంలోనే ప్రభుత్వ రంగంలో బస్సు నడిపిన తొలి మహిళా డ్రైవర్‌గా గుర్తింపు పొందారు. సరోజిని నగర్ డిపోలో రోజుకు 135 కి.మీ నడిపేవారు. ఆమె సేవలకు ఢిల్లీలో మంచి గుర్తింపు లభించింది. 2018లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా, అలాగే కిరణ్ బేడి వంటి ప్రముఖుల నుండి ‘ఉమెన్ అచీవర్స్’ అవార్డును అందుకున్నారు.

టీఎస్‌ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా రికార్డు
ఢిల్లీలో కాంట్రాక్టు ఉద్యోగం, అధిక ఖర్చుల కారణంగా సరిత తెలంగాణకు తిరిగి రావాలనుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో, తెలంగాణ ప్రభుత్వం ఆమె విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, టీఎస్‌ఆర్టీసీలో స్పెషల్ రిక్రూట్‌మెంట్ కింద ఉద్యోగం కల్పించింది. తాజాగా, హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపి, టీఎస్‌ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా సరిత రికార్డు సృష్టించారు. ఆమె సాధించిన ఈ విజయం మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచి, ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News