బనగానపల్లె నియోజకవర్గంలో మహిళా ఓటర్లే విజేతను నిర్ణయించనున్నారు. నియోజకవర్గంలో 2,41,179 మంది ఓటర్లు ఉండగా అందులో పురుష ఓటర్లు 1,18,621 ఉండగా మహిళా ఓటర్లు 1,23,050 ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 4931 మంది అధికంగా ఉన్నారు. బనగానపల్లి మండలంలో 42, 972మంది, అవుకు మండలంలో 21,436 మంది, కొలిమిగుండ్ల మండలంలో 21,792మంది, కోవెలకుంట్ల మండలంలో 20563 మంది, సంజామల మండలంలో 16,280 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ లో 1,00,532 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయా మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే మహిళలు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులకు మించి మహిళలు క్యూలైన్లలో బారులు తీరారు. మహిళల ఓట్లు ఎవరికి అనుకూలంగా ఉంటాయో వారి గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి. బనగానపల్లె పట్టణంలో ముస్లిం మహిళలు సైతం అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనిని బట్టి చూస్తే అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించడంలో మహిళల ఓట్లే కీలకంగా మారాయి. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ పాలనకు మద్దతు పలికారా, లేక టీడీపీ సూపర్ సిక్స్ పథకాలకు మద్దతుగా నిలిచారా అన్నది కౌంటింగ్ రోజున తేలనుంది.
Banaganapalle: గెలుపోటములను శాసించనున్న మహిళలు
మహిళా ఓటర్లే అధికం..