మత పిచ్చి- కుల పిచ్చితో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టవద్దని సీఎం కేసీఆర్ బీజేపీపై మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఖరి ఇలాగే కొనసాగితే మన దేశం మరో ఆప్ఘనిస్తాన్ అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన చెందారు. యువత ఇవన్నీ ఆలోచించి, వైషమ్యాలకు దూరంగా ఉండాలంటూ..మానుకోట సభలో కేసీఆర్ పిలుపు నిచ్చారు.
కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్ .. నదీ జలాలు సద్వినియోగం చేసుకోవడంలో మోడీ సర్కారు విఫలమైందన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు నీళ్లకోసం తల్లడిల్లుతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని ఆరోపించారు మానుకోట బహిరంగ సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ వస్తే బంగారు మీసాలు చేయిస్తా అని కొమురువెల్లి స్వామికి మొక్కుకున్న విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్.. స్వామి దయ, ప్రజలు చేసిన ఉద్యమం, మానుకోట రాళ్ళ బలం అన్నీ కలిసి అద్భుత రాష్ట్రం సాకారమైందన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గురువు నూకల రాంచంద్రారెడ్డి లాంటి మహనీయులను భావితరాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి కాంస్య విగ్రహాన్ని మానుకోటతోపాటు వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాటు చేసి.. ఒక ప్రతిష్టాత్మక సంస్థకు నూకల రాంచంద్రా రెడ్డివారి పేరు పెట్టనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.