పెండింగులో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇంటి బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇయ్యకపోతే అమరణ నిరాహారదీక్ష చేస్తానని, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని పోచారం శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. నన్ను నమ్ముకుని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. వారి బాధ నేను చూడలేను భావోద్వేగంతో పోచారం అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్, కోటగిరి, రుద్రూరు మండల కేంద్రాలలో ఈరోజు జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో జహీరాబాద్ BRS పార్టీ MP అభ్యర్థి గాలి అనీల్ కుమార్ తో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి .
బాన్సువాడ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి , మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ…
“BRS ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే మంజూరు అయ్యాయి. అందులో 10,000 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించుకున్న పేద లబ్ధిదారులకు BRS ప్రభుత్వంలో రూ. 400 కోట్ల బిల్లులు ఇప్పించాను. ప్రభుత్వం మారిన తరువాత పెండింగ్ లో ఉన్న రూ. 26 కోట్ల బిల్లులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మంత్రిని కోరితే ఆయన అంగీకరించారు. తరువాత ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ మంత్రి దగ్గరకు వెళ్ళి బిల్లులు ఇవ్వొద్దని చెప్పారట.
BRS ప్రభుత్వంలో రూ. 400 కోట్ల బిల్లులు ఇప్పించాను. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 30 కోట్ల బిల్లులను ఇవ్వడం లేదు. నన్ను నమ్ముకుని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు. వారి బాధ నేను చూడలేను. పార్లమెంట్ ఎన్నికల లోపు బిల్లులు రాకపోతే మే 13 ఓటింగ్ తరువాత లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాను. అయినా ప్రభుత్వం స్పందించక బిల్లులు ఇయ్యకపోతే అమరణ నిరాహారదీక్ష చేస్తాను, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాను. పేదల కోసం నాకు ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదు.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి ఆశపడి ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు హామీలు అమలు కాలేదు. రైతుబంధు ఎకరాకు రూ. 15,000, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు.
అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల కరంటు ఇస్తామన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో ఆడబిడ్డకు లక్షా పదహారు వేల రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఒక్కరికీ కూడా ఇవ్వకుండా నా అక్కా చెల్లెలను మోసం చేస్తున్నారు. డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను, రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు లేదు. రైతులను మోసం చేశార” ని పోచారం నిప్పులు చెరిగారు.