Friday, April 4, 2025
HomeఆటRevanth Reddy: సన్‌రైజర్స్-HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

Revanth Reddy: సన్‌రైజర్స్-HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నెలకొంది. మ్యాచ్‌లను అభిమానులు ఆస్వాదిస్తున్నారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (HCA) మధ్య తలెత్తిన వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంప్లిమెంటరీ పాస్‌లు కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు SRH‌ ఫ్రాంఛైజీని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ హోమ్‌ గ్రౌండ్‌ ఉప్పల్‌ స్టేడియాన్ని వదిలిపెట్టే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి హెచ్‌సీఏకు ఒప్పందం ప్రకారం 10% ఉచిత టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా 50 టిక్కెట్ల సామర్థ్యం ఉన్న కార్పొరేట్‌ బాక్స్‌ను హెచ్‌సీఏకు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఆ బాక్స్‌ సామర్థ్యం 30కి తగ్గిందని చెబుతూ అదనంగా మరో 20 టిక్కెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ డిమాండ్‌ చేసిందని సమాచారం. ఈ క్రమంలో ఓ మ్యాచ్ సందర్భంగా హెచ్‌సీఏ అధికారులు కార్పొరేట్‌ బాక్స్‌కు తాళం వేశారని.. చివరకు 20 టిక్కెట్లు ఇస్తేనే తాళం తీస్తామని ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌ జనరల్ మేనేజర్ శ్రీనాథ్‌ హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

ఈ ఆరోపణలపై హెచ్‌సీఏ వెంటనే స్పందించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం అధికారిక ఇమెయిల్‌ ద్వారా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హెచ్‌సీఏ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.

తాజాగా ఈ వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ అయ్యారు. ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ కార్యాలయం అధికారులు వివరాలు సేకరించారు. టికెట్లు బ్లాక్‌మెయిలింగ్ విషయంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణలో పాసుల కోసం బెదిరించినట్లు తేలితో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News