IND vs AUS| బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పూర్తిగా పట్టు బిగించింది. ఆస్ట్రేలియాకు 534 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 172/0తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 487/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. సీనియర్ ఆటగాడు కింగ్ కోహ్లీ(Kohli) ఎట్టకేలకు సెంచరీతో ఆకట్టుకున్నాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. 16 నెలల తర్వాత టెస్టుల్లో కోహ్లీ సెంచరీ చేయడం విశేషం. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు(7) చేసిన భారత ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (6) పేరిట ఉండేంది.
ఇక యశస్వి జైస్వాల్ 161 పరుగులతో అదరగొట్టగా.. కేఎల్ రాహుల్ 77 పరుగులు చేశాడు. తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి 38 పరుగులతో రాణించాడు. దాంతో భారత్ 487 పరుగుల స్కోర్ చేసింది. భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారుకు భారత బౌలర్లు ఆదిలోనే షాక్ ఇచ్చారు. వరుసగా మూడు వికెట్లు తీసి మ్యాచుపై పట్టు బిగించారు. మూడో రోజు ఆట ముగిసే నాటికి ఆస్ట్రేలియా 12/3 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. మరో రెండు రోజులు సమయం ఉండటం.. ఆసీస్ విజయానికి ఇంకా 522 పరుగుల చేయాల్సి ఉండటంతో బుమ్రా సేన విజయం నల్లేరు మీద నడకే కానుంది.