ఐపీఎల్ ప్రారంభమైన 17 ఏళ్లయినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందని ద్రాక్షలా మిగిలింది. ఈ సారి మాత్రం ఫైనల్ కలను సాకారం చేసుకుంటుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. 18వ సీజన్ లో ఇప్పటి వరకు అద్భుత ప్రదర్శనతో ముందుకెళ్తున్న ఆర్‌సీబీ, 11 మ్యాచ్‌లలో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. నెట్‌రన్‌రేట్ +0.482గా ఉండగా, ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశాన్ని కలిగి ఉంది.
ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న ఆర్‌సీబీకి, ఇప్పుడు ఓ శుభవార్త లభించింది. ఐపీఎల్ వాయిదా నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిన ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ మళ్లీ లీగ్‌కు చేరుతున్నాడు. అతడు తిరిగి భారతదేశానికి రావడం ఖాయమని సమాచారం. భుజ గాయంతో కొంతకాలంగా దూరమైన హేజిల్‌వుడ్ తిరిగి ఆడతాడన్న వార్తలు ఇప్పుడు అధికారికంగా కన్‌ఫర్మ్ కావడం ఆర్‌సీబీ అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది.
ఇంతకు ముందు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన హేజిల్‌వుడ్, తన పేస్ అటాక్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. జూన్‌లో జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టులోకి ఎంపికైనా, ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లు కూడా ఆడతాడన్న విషయం క్లారిటీతో స్పష్టమవుతోంది. ఇప్పుడు హేజిల్‌వుడ్ లాంటి బలమైన బౌలర్ తిరిగి జట్టులోకి రావడంతో ఆర్‌సీబీకి టైటిల్ ఆశలు మరింత బలపడనున్నాయి. టఫ్ టైంలో స్ట్రైక్ బౌలర్ మళ్లీ జట్టులో ఉండడం.. ప్లేఆఫ్ రేసులో కీలక టర్నింగ్ పాయింట్ కావచ్చు.