Haris Rauf on Virat Kohli stunning sixs : టీ20 ప్రపంచకప్ 2022లో బాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను అభిమానులు అంత త్వరగా మరిచిపోరు. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 82 పరుగుల అభేధ్యమైన ఇన్నింగ్స్‌తో టీమ్ఇండియాను గెలిపించాడు. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చిన ఆ ఇన్నింగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్‌గా చరిత్రకెక్కింది.
పాకిస్థాన్ బౌలర్ హారీస్ రవూఫ్ వేసిన 19 ఓవర్‌లో చివరి రెండు బంతులను విరాట్ సిక్సర్లుగా మలిచాడు. దీంతో మ్యాచ్ టీమ్ఇండియా వైపు మొగ్గింది. తాజాగా ఈ సిక్స్‌లపై రవూఫ్ స్పందించాడు. ఆ రెండు సిక్స్‌లను విరాట్ కోహ్లీ కాకుండా మరే ఆటగాడు కొట్టినా తాను బాధపడే వాడినన్నాడు.
“కోహ్లీలా ఎవ్వరూ బ్యాటింగ్ చేయలేరు. వరల్డ్ కప్‌లో అతను ఆడిన విధానం అద్భుతం. ప్యూర్ క్లాస్ బ్యాటింగ్. అతడు ఎలాంటి షాట్లు ఆడగలడో అందరికీ తెలుసు. విరాట్ కాకుండా ఆ స్థానంలో ఎవరు ఉన్నా నేను విసిరిన బంతులకు అలాంటి షాట్లు ఆడలేకపోయేవారేమో. ఒక వేళ దినేశ్ కార్తిక్, హార్థిక్ పాండ్యా ఆ సిక్స్‌లను కొట్టి ఉంటే మాత్రం నేను చాలా బాధపడేవాడినని” హారీస్ రవూఫ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.