తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత క్రీడలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నామని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అనేక సదుపాయాలతో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వాలీబాల్ ఆడనున్న మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్న రేవల్లి జట్టును ఆయన అభినందించారు. చిన్న రేవల్లి వాలీ బాల్ జట్టుపై మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇవాళ మహబూబ్ నగర్ ప్రతిష్టను జాతీయస్థాయిలో తీసుకెళ్లడం గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో వాలీ బాల్ ప్లేయర్లను ఆయన సన్మానించారు. చిన్న రేవల్లి వాలీబాల్ జట్టు సాధించిన ఘనత ఎంతోమంది ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకమన్నారు. చిన్న రేవల్లి గ్రామంలో వాలీబాల్ కు సంబంధించి రెండు కోర్టులను వెంటనే ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెలలోపు మహబూబ్ నగర్ లో జాతీయస్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కోయంబత్తూర్ లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో విజయంతో తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ గ్రామానికి చెందిన నైపుణ్యమైన క్రీడాకారులను శిక్షకులుగా నియమిస్తామని అన్నారు. కోయంబత్తూర్ కు వెళ్లే చిన్న రేవల్లీ జట్టుకు రూ. 50 వేల నగదును బహుమతిగా అందించారు.