Fox on Cricket Ground: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి పాములు, కుక్కలు రావడం చాలా సార్లు చూశాం. తాజాగా ఓ అనుకోని అతిథి మ్యాచ్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్ లోకి వచ్చి సందడి చేసింది. అభిమానులను, సెక్యూరిటీని దాటుకొని మరీ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. దాని కారణంగా మ్యాచ్ ను కొద్ది సేపు నిలిపేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆ అతిథి ఎవరు అనుకుంటున్నారా?
ఇంగ్లాండ్ లో ఆగస్టు 05న ది హండ్రెడ్ టోర్నీ ఆరంభమైంది. ఇందులో ఇరు జట్లు వందేసి బంతులు ఆడుతాయి. ఈ ఈవెంట్ లో భాగంగా లార్డ్స్ మైదానంలో లండన్ స్పిరిట్ వర్సెస్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ జట్టు 94 బంతుల్లో 80 పరుగుల మాత్రమే చేసి ఆలౌటైంది. అనంతరం ఇన్విన్సిబుల్స్ టీమ్ ఛేజింగ్ కు దిగింది. ఈ క్రమంలో 8వ బంతి వద్ద లండన్ బౌలర్ డానియల్ వొరెల్ బౌలింగ్ చేస్తుండగా సడన్ గా నక్క గ్రౌండ్ లోకి పరుగెత్తికొచ్చింది. అది వేగంగా పరిగెడుతూ అందరినీ కంగారు పెట్టింది. దీంతో మ్యాచ్ కాసేపు ఆపేసి అందరూ దానిని ఆసక్తిగా చూడటం మెుదలుపెట్టారు.
అయితే ఆ నక్కను పట్టుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు. కాసేపు స్వేచ్ఛగా స్టేడియం మెుత్తం తిరిగిన నక్క ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టకుండా బౌండరీ లైన్ వద్ద బయటకు వెళ్లిపోయింది. దీంతో ఆడియెన్స్ చప్పట్లు మోత మోగించారు. నక్క వెళ్లిపోయిన అనంతరం తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది.
ఇదిలా ఉండగా .. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని లండన్ స్పిరిట్ జట్టు టాస్ గెలిచి ముందుగా చేసింది. అయితే ఇన్విన్సిబుల్స్ బౌలర్ల ధాటికి ఆ జట్టు 80 పరుగులకే కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఆస్టన్ టర్నర్ (21 పరుగులు) ఒక్కడే టాప్ స్కోరర్. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో శామ్ కుర్రాన్, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టాడు.అనంతరం లక్షచేధనలో ఇన్విన్సిబుల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఇంకా 31 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను ఛేదించారు.


