Lava Agni 4 Features: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లావా మరో కొత్త ఫోన్తో మార్కెట్ను షేక్ చేయనుంది. వచ్చే నెలలోనే లావా అగ్ని 4 పేరుతో కొత్త ఫోన్ విడుదల కానుంది. లావా తన రాబోయే అగ్ని 4 స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో లావా అగ్ని 4కు సంబంధించిన టీజర్ ఇమేజ్ను ఇప్పటికే విడుదల చేసింది. అయితే, ఫోన్ పూర్తి డిజైన్కు సంబంధించి వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న లావా అగ్ని 4 ఫీచర్లు, ధర ఇతర వివరాల గురించి తెలుసుకుందాం.
నవంబర్లోనే మార్కెట్లోకి రిలీజ్..
కంపెనీ అక్టోబర్ 2025లో అగ్ని 3ని ప్రారంభించింది. ఇప్పుడు దాని సక్సెసర్గా లావా అగ్ని 4ని విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల, నవంబర్ 2025లో ఈ స్మార్ట్ఫోన్ లాంచ్ అవుతుందని కంపెనీ స్వయంగా ప్రకటించింది. అయితే, ఖచ్చితమైన లాంచింగ్ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు. కంపెనీ టీజర్ పోస్టర్ ప్రకారం, ఈ స్మార్ట్ఫోన్ బాక్సీ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. దీని వెనుక ప్యానెల్ అంచుల వద్ద కర్వ్‌గా కనిపిస్తుందని, సైడ్ ప్యానెల్‌లు ఫ్లాట్‌గా ఉన్నాయని టీజర్లో సూచించింది. అంచులలో యాంటెన్నా లైన్లు కూడా కనిపిస్తున్నాయి. స్పీకర్ హోల్, అదనపు మైక్రోఫోన్, పైభాగంలో IR బ్లాస్టర్/3.5 మి.మీ ఆడియో జాక్ వంటి ఫీచర్లను చూడవచ్చు. కెమెరా మాడ్యూల్ విషయానికొస్తే, దీని ముందు ఫోన్ల మాదిరిగా కాకుండా, అడ్డంగా ఉంచబడిన పిల్-ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇంకా, కెమెరా మాడ్యూల్లో టెక్నో పోవా స్లిమ్ మాదిరిగానే డైనమిక్ మూడ్ లైట్లను కూడా అందించింది.
లావా అగ్ని 4 స్పెసిఫికేషన్లు ఇవే..
మునుపటి అప్‌డేట్లను పరిశీలిస్తే, లావా అగ్ని 4 రెండర్ ఇమేజ్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో కనిపించింది. టీజర్ ఇమేజ్లో కూడా సరిగ్గా అలాంటి ఫీచర్లనే పేర్కొంది. కెమెరా మాడ్యూల్‌లో రెండు కెమెరా సెన్సార్లు, ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ వంటి ఫీచర్లను కూడా చేర్చనుంది. సాధ్యమైన స్పెసిఫికేషన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్, 6.7 అంగుళాల ఫుల్ HD+ 120Hz డిస్ప్లే, డ్యూయల్ 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాలు, 7000mAh భారీ బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లను పేర్కొంది. భారతీయ మార్కెట్లో దీని ధర రూ. 25,000 లోపు ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


