WhatsApp New Feature to restrict Spam Messages with AI: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. అందుకే, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యూజర్లు ఇప్పటికీ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. తాజాగా, వాట్సాప్ తన యూజర్ల డేటా భద్రత కోసం కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. యూజర్లను నిత్యం ఇబ్బంది పెట్టే అనవసరమైన ప్రచార సందేశాలు, స్కామ్‌లను అరికట్టేందుకు త్వరలో సరికొత్త ‘యాంటీ-స్కామ్ ఫీచర్’ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా పనిచేయనుందని సమాచారం. తెలియని నంబర్ల నుండి వచ్చే స్పామ్, మోసపూరిత సందేశాలను గుర్తించి, యూజర్లు వాటి బారిన పడకుండా హెచ్చరించడమే దీని ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా, ‘జాబ్ ఆఫర్స్’, ‘లాటరీ గెలుచుకున్నారు’ ఏపీకే ఫైల్స్ రూపంలో బహుమతులు ఇలా ఎన్నో స్పామ్ వంటి వాటిని కట్టడి చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అనుమానాస్పద సందేశాలను ఈ ఫీచర్ సులభంగా గుర్తిస్తుంది. ఇప్పటికే వాట్సాప్‌లో స్కామ్ డిటెక్షన్ కోసం కొన్ని భద్రతా చర్యలు ఉన్నప్పటికీ, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే ఈ ఫీచర్ మరింత పటిష్టంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. గ్రూప్ చాట్‌లలో కూడా కొత్తవారు యాడ్ చేసినప్పుడు ‘సేఫ్టీ ఓవర్‌వ్యూ’ వంటి హెచ్చరికలను అందించే ఫీచర్లను వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టింది. కొత్త యాంటీ-స్కామ్ ఫీచర్ ద్వారా, ప్రచార మెసేజ్‌ల సమస్యను చాలా వరకు తగ్గించవచ్చని కంపెనీ యోచిస్తోంది. అనవసరమైన, హానికరమైన కంటెంట్ యూజర్లను చేరకుండా నిరోధించడం, తద్వారా ప్లాట్‌ఫారమ్‌ను మరింత సురక్షితంగా మార్చడం దీని ఉద్దేశం. ఈ ఫీచర్ మొదట బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చి, ఆ తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చర్య వాట్సాప్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.
కొత్తగా థ్రెడెడ్ రిప్లైస్ ఫీచర్..
వాట్సాప్ ఇటీవలే మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ వాట్సాప్ చాటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా, ఎప్పుడూ గందరగోళంగా ఉండే గ్రూప్ చాట్స్ కు ఒక పరిష్కారం తీసుకొచ్చింది. అదే “థ్రెడెడ్ రిప్లైస్” ఫీచర్. దీంతో, ఏ మెసేజ్‌కు ఎవరు రిప్లై ఇచ్చారో తెలుసుకోవడానికి చాట్ అంతా పైకి స్క్రోల్ చేయాల్సిన పనిలేదు. ఈ కొత్త ఫీచర్‌తో, ఒక మెసేజ్‌కు సంబంధించిన అన్ని రిప్లైలు ఒకేచోట కనిపిస్తాయి. ఒకే చాట్‌లో జరిగే వేర్వేరు కన్వర్జేషన్లను విడివిడిగా చూడటానికి వీలు కల్పించేదే థ్రెడెడ్ రిప్లైస్ ఫీచర్. మీరు ఒక మెసేజ్‌కు రిప్లై ఇచ్చినప్పుడు, ఆ రిప్లై అసలు మెసేజ్ కింద ఒక ప్రత్యేకమైన థ్రెడ్‌లా ఏర్పడుతుంది. ఆ మెసేజ్‌లో కనిపించే కొత్త రిప్లై ఇండికేటర్‌పై నొక్కగానే, ఆ కన్వర్జేషన్‌కు సంబంధించిన రిప్లైలు అన్నీ ఒకే సీక్వెన్స్‌లో కనిపిస్తాయి. దీనివల్ల అనవసరమైన మెసేజ్‌ల మధ్య అసలు విషయం మిస్ అవ్వకుండా, అంతా ఒకేచోట చూసుకోవచ్చు. ఒకసారి థ్రెడ్‌లోకి వెళ్లాక, యూజర్లు ఆ కన్వర్జేషన్‌కు సంబంధించిన పాత రిప్లైలను కాలక్రమంలో చూడవచ్చు. కొత్త రిప్లైలు ఇస్తే అవి కూడా ఆటోమేటిక్‌గా అదే థ్రెడ్‌కు యాడ్ అవుతాయి. అంతేకాదు, థ్రెడ్‌లోని నిర్దిష్ట మెసేజ్‌లకు కూడా రిప్లై ఇవ్వొచ్చు. వీటిని “ఫాలో-అప్ రిప్లైస్ అని పిలుస్తారు. ఒకేసారి ఎక్కువ మంది వేర్వేరు విషయాల గురించి మాట్లాడుతున్న క్రమంలో కూడా, ఏ టాపిక్ దేనిదో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ ఫీచర్ పనికొస్తుంది.


