Car on compound wall: హైదరాబాద్‌లో ఒక విచిత్ర ఘటన హైదరాబాద్‌ల చోటుచేసుకుంది. నిద్రమత్తులో ఉన్న ఓ డ్రైవర్ తన కారును ఏకంగా ఒక ఇంటి కాంపౌండ్ గోడపైకి ఎక్కించేశాడు. ఈ ఉదయం నిద్రలేచిన ఇంటి యజమానులు తమ గోడపై కారును చూసి షాక్‌కు గురయ్యారు.
ఈ విస్మయకరమైన సంఘటన హైదరాబాద్ శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లాకు చెందిన శంభీపూర్ అనే వ్యక్తి రాత్రి సమయంలో తన కారు నడుపుతూ నిద్రమత్తుకు లోనయ్యాడు. దీంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటి కాంపౌండ్ గోడపైకి దూసుకెళ్లి, గోడ చివరకు చేరి ఆగిపోయింది.
ఈ ప్రమాద శబ్దం వినిపించడంతో స్థానిక ఇంటి యజమానులు ఒక్కసారిగా నిద్రలేచి బయటకు వచ్చారు. తమ ఇంటి గోడపై కారును చూసి వారు కంగుతిన్నారు. వెంటనే కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఉదయం క్రేన్ సహాయంతో కారును గోడపై నుంచి కిందకు దించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కారు గోడపైకి ఎక్కడాన్ని చూసిన స్థానికులందరూ ఆశ్చర్యపోయారు. చాలా మంది ఈ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. “అసలు అక్కడ ఎలా పెట్టావ్ బ్రో?” అని కొందరు ప్రశ్నించగా, మరికొందరు హాస్యంగా “ఇంకో పెగ్ వేస్తే కారును ఎలా పెట్టాడో అలాగే కిందకు కూడా దించేసేవాడు!” అని కామెంట్లు చేశారు.


