Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Puppy Yoga: శునకాలతో యోగా... ఆరోగ్యం, ఆనందం సొంతం!

Puppy Yoga: శునకాలతో యోగా… ఆరోగ్యం, ఆనందం సొంతం!

Puppy yoga for stress relief : నగర జీవనం, ఉరుకులు పరుగుల పయనం… ఆధునిక కాలంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం! ఈ ఒత్తిడిని దూరం చేసుకోడానికి మనుషులు ఎన్నో మార్గాలు వెతుకుతుంటారు. మరి దీనికి అత్యంత ఆహ్లాదకరమైన, మనసుని తేలిక పరిచే ఒక వినూత్న మార్గం అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది? అదే ‘పప్పీ యోగా’! బుజ్జి కుక్కపిల్లలతో కలిసి యోగా చేయడం… వినడానికే వింతగా ఉన్నా, ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు మన హైదరాబాద్‌ నగరంలోనూ ఈ కొత్త కల్చర్ విస్తరిస్తోంది. అసలు ఏమిటీ పప్పీ యోగా? ఇది ఎలా పని చేస్తుంది? దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? రండి, వివరంగా తెలుసుకుందాం!

- Advertisement -

పాగా’ సంస్థ కృషి: వీధి శునకాలకు కొత్త జీవితం, మనుషులకు ప్రశాంతత : ‘పాగా’ అనే సంస్థ ఈ పప్పీ యోగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీధి శునకాలను సంరక్షించడం, వాటి దత్తతను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. దేశంలోని పలు నగరాలతో పాటు, హైదరాబాద్‌లోనూ ఈ యోగా సెషన్లను ‘పాగా’ నిర్వహిస్తోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ యోగా సెషన్లలో పాల్గొనేందుకు మీ పెంపుడు శునకాలను తీసుకురావాల్సిన అవసరం లేదు. నిర్వాహకులే వ్యాక్సినేషన్ పూర్తయిన బుజ్జి కుక్కపిల్లలను అందిస్తారు.

ఎలా జరుగుతుంది ఈ పప్పీ యోగా సెషన్..
సరళమైన ఆసనాలు: పప్పీ యోగాలో పెద్దగా సంక్లిష్టమైన ఆసనాలు ఉండవు. సాధారణ యోగాసనాలే ఉంటాయి. అయితే, కుక్కపిల్లల సమక్షంలో వీటిని చేయడం ఒక వినూత్న అనుభూతిని ఇస్తుంది.

బుజ్జి శునకాలతో మమేకం: పాల్గొనేవారికి నిర్వాహకులు ఒక కుక్కపిల్లను ఇస్తారు. వాటిని ఒక పద్ధతిలో పట్టుకుని యోగాసనాలు వేయాలి. కొన్ని ఆసనాలు శునకాలను ముందు ఉంచుకొని చేయాల్సి ఉంటుంది.

అల్లరి పనులు, ఆనందం: యోగా చేస్తున్నప్పుడు ఈ బుజ్జి శునకాలు కాళ్ల మధ్యలో చుట్టూ తిరుగుతూ, అల్లరి చేస్తూ ఉంటాయి. ఇది పాల్గొనే వారికి మరింత ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వాటితో ఆడుకున్న అనుభూతిని ఇస్తుంది.

ఎంట్రీ ఫీజు, నిధుల వినియోగం: ఈ సెషన్‌కు హాజరు కావడానికి కొంత ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఈ రుసుములో కొంత భాగం శునకాలను ఇప్పటివరకు సంరక్షించిన కేర్‌టేకర్‌లకు, మిగిలిన మొత్తం మూగజీవాల సంరక్షణకు వినియోగిస్తామని ‘పాగా’ సహ వ్యవస్థాపకురాలు శుభ శ్రీ తెలిపారు.

దత్తత అవకాశం: రెండు గంటల సెషన్ పూర్తయిన తర్వాత, నచ్చినట్లయితే ఆ దేశీయ శునకాలను ఉచితంగా దత్తత తీసుకోవచ్చు.
మానసిక ప్రశాంతతకు యోగా, శునకాల స్పర్శ : ఎన్నో అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే, శునకాలను ప్రేమగా స్పృశించిన ప్రతిసారీ మానవులలో ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయి. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. వాటితో సరదాగా యోగా చేస్తే మనసు తేలిక అవుతుందని ‘పాగా’ నిర్వాహకులు వివరిస్తున్నారు. అంతేకాదు, ఎప్పుడూ ఒంటరిగా భావించే శునకాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిపుణులు కూడా యోగా అనేది ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగమని, మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.

అడాప్ట్ డోంట్ షాప్’: ‘పాగా’ నినాదం : “అడాప్ట్ డోంట్ షాప్” (కొనవద్దు, దత్తత తీసుకోండి) అనేది ‘పాగా’ సంస్థ నినాదం. వేలు, లక్షలు వెచ్చించి విదేశీ జాతుల కుక్కలను కొనుగోలు చేసే బదులు, మన పరిసరాల్లో ఉన్న దేశీయ శునకాలను దత్తత తీసుకోవాలని ‘పాగా’ సహ వ్యవస్థాపకులు శుభ శ్రీ, సింధు, స్వాతి పిలుపునిస్తున్నారు. ఆ డబ్బుతో వాటికి జీవితాంతం నాణ్యమైన ఆహారం అందించవచ్చని వారు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad