ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు ‘ఇందిరమ్మ’ పేరు పెడితే ఒప్పుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తేల్చి చెప్పారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీ చేరిన సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయమన్నారు. కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు ప్రధాని మోదీ(PM Modi) ఫొటో ముద్రించాల్సిందేనని స్పష్టం చేశారు. రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టకపోతే ఉచిత బియ్యం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ప్రధాని ఫొటో పెట్టకపోతే కేంద్రమే నేరుగా ఉచిత బియ్యం అందించే అంశంపై ఆలోచన చేస్తామన్నారు.
ఇక ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ గెలవడం ఖాయమన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు తాను నిధులు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు పనులు ప్రారంభించారన్నారు. కరీంనగర్ సిటీ కోసం ఎంత కష్టపడినప్పటికీ తనను ఏనాడూ ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవలేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందని విమర్శించారు.