కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు(BRS MLCs) శాసనమండలి ఆవరణలో వినూత్నంగా నిరసనలు చేపడుతున్నారు. సోమవారం మిర్చి రైతులను ఆదుకోవాలని మెడలో మిరపకాలయ దండలతో నిరసనకు దిగారు. తాజాగా మహిళలకు స్కూటీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ స్కూటీలు ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో మహిళలకు ఇస్తామన్న స్కూటీల హామీ ఏమైంది? ఎప్పుడిస్తారంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద కవిత మాట్లాడుతూ.. 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్ల అప్పులు తెచ్చిందన్నారు. కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు తులం బంగారం ఇస్తామని చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారని.. ఇంతవరకు ఆ హామీపై కార్యాచరణ కూడా రూపొందించలేదని ఫైర్ అయ్యారు. మహిళలకు స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. స్కూటీ హామీ వెంటనే అమలు చేయాలని విద్యార్థుల తరపున కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీకి లేఖలు రాస్తామని ఆమె తెలిపారు.
