చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వెంటనే ప్రకటించాలని కోరుతూ జేఏసీ నాయకులు చేర్యాల పట్టణంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. జేఏసీ నాయకులు అందె అశోక్ తాడెం ప్రశాంత్, బోయిని మల్లేశం రెవెన్యూ డివిజన్ కోసం నినాదాలు చేశారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి చేర్యాల రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డివిజన్ ప్రకటించే వరకు సెల్ టవర్ నుంచి దిగేది లేదని నినాదాలు చేశారు. మూడు గంటల పాటు సెల్ టవర్ పైనే నిలబడి నినాదాలు చేస్తున్నడంతో స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు సెల్ టవర్ నుంచి దిగకుండా ఉండిపోయి నినాదాలు చేస్తుండడంతో చేర్యాల తాసిల్దార్ రాజేశ్వరరావు, జేఏసీ నాయకులు రామగల పరమేశ్వర్, పుర్మా ఆగం రెడ్డి, వెంకట మావో, అంబటి అంజయ్య, జేఏసీ నాయకులు భారీ ఎత్తున తరలి వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేర్యాల మండల అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ తన లెటర్ ప్యాడ్ ద్వారా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం తాను బాధ్యత తీసుకుంటానని సంతకం చేసి చదివి వినిపించారు. అనంతరం తాసిల్దార్ ఆర్డీవోకు ఫోన్ చేసి జెఏసి నాయకులతో మాట్లాడించి హామీ ఇప్పించడంతో శాంతించారు.