Earth quake: తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, విజయవాడ జిల్లాల్లో స్వల్ప భూకంపం వచ్చింది.
ఉదయం 7 గంటల 27 నిమిషాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 20 సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో ఇంట్లో వస్తువులు కదిలాయి. దీంతో ప్రాణభయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. వరంగల్ జిల్లాలో 7 గంటల 28 నిమిషాలకు స్వల్ప భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ములుగు జిల్లాలోనూ బుధవారం ఉదయం 7 గంటల 27 నిమిషాల్లో భూమి కంపించింది. ఇంట్లోని వస్తువులు కదలడంతో పాటు శబ్ధాలు రావడంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు.
అలాగే హైదరాబాద్‌లోనూ ఇవాళ ఉదయం 7:26 గంటల నుంచి 7:31 గంటల మధ్య భూమి కంపించింది. దీంతో హైదరాబాద్ నగరవాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ముఖ్యంగా హిమాయత్ నగర్, సరూర్ నగర్, సూరారం అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, యూసఫ్ గూడ, ఉప్పల్, మేడ్చల్, మియాపూర్, ఖైరతాబాద్, శేర్‌లింగంపల్లి, తదితర ప్రాంతాల్లో సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చాయి.
ఇవే కాకుండా హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపాలపల్లి, చర్ల ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపాలగూడెం లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు.