రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి మహిళాభివృద్ధి సంక్షేమానికి పెద్ద పీట వేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ వచ్చే నెల 2 నుంచి 23వరకు ఘనంగా నిర్వహించాలని అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. 9 ఏళ్లలో గిరిజన సంక్షేమ శాఖలో, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో జరిగిన మార్పులు, డెవలప్ మెంట్ ను ఈ వేడుకల్లో ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా తండాలు,గిరిజన ప్రాంతాల అభివృద్ధి మొదలు గిరి వికాసం, సిఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ వంటి అనేక పథకాల ద్వారా లబ్ధిదారుల వివరాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణులకు, చిన్నారులకు అందిస్తున్న పోషక ఆహారం, ఇతర సౌకర్యాలు వీడియోలతో డాక్యుమెంటరీలు రెడీ చేసి పబ్లిక్ కు వివరించాలని మంత్రి ఆదేశించారు. 9ఏండ్ల క్రితం గిరిజనుల పరిస్థితి ఇప్పుడు ఉన్న అభివృద్ధి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి వారికి అందుతున్న సంక్షేమ పథకాలు,లబ్ది పొందుతున్న వారి వివరాలు డాక్యుమెంటరీల్లో ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు పుడితే అమ్ముకునే పరిస్థితి నుండి పుడితే ఆడపిల్లే పుట్టాలని అని ప్రజలు కోరుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామస్థాయి నుండి నియోజకవర్గం, జిల్లాల్లో ఉన్న అంగన్వాడి సెంటర్ లు, మహిళా ప్రాంగణాలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు లబ్ధిదారుల వివరాలను వివరిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరితగతిన వీడియోలను పూర్తిచేయాలని అధికారులను డాక్యుమెంటరీ ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, జీసీసీ చైర్మన్ రామావత్ వాల్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్త్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలీ కేరి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్,బిసి గురుకుల సెక్రటరీ మల్లయ్య బట్టు, ట్రైకార్ జిఎం శంకర్ రావు, స్టేట్ మిషన్ మేనేజర్ ట్రైకర్ లక్ష్మీప్రసాద్,
జెడి లక్ష్మి, కార్పొరేషన్ ఏజీఎం సబిత, తెలంగాణ ఫుడ్స్ జిఎం విజయ,మేనేజర్ హెచ్ ఆర్ కృష్ణవేణి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.