ప్రపంచ ఆర్థిక సదస్సులో పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందం దావోస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఈ సదస్సులో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరీలతో రేవంత్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించారు. మరోవైపు దావోస్‌లో పలు అంతర్జాతీయ సీఈవోలతో రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ కానున్నారు. ఈ భేటీల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్‌తో పాటు స్కిల్ డెవలప్మెంట్ రంగానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు. ‘ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ’ లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్రం 1 ట్రిలియన్ అర్థిక వ్యవస్థగా భాగస్వామ్యం కావాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు.