KTR| బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ఉద్యమం సమయంలో జైలుకు వెళ్లిన నాటి సంగతిని ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. “జైలుకెళ్లిన ఆ రోజు.. జైలు జీవితాన్ని గుర్తు చేసే బ్యాడ్జీ జీవితాంతం నాకు ఆరాధనీయం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 15ఏళ్ల క్రితం ఇదే రోజు నన్ను అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలులో ఉంచారు. జైలులో నా గుర్తింపునకు చెందిన కార్డు తనకు బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అని, నా జీవితాంతం నేను ఆరాధించేది” అని అరెస్ట్ అయిన నాటి ఫొటోను పంచుకున్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా గత కొన్ని రోజులుగా కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దీనికి కేటీఆర్ కూడా తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో జైలుకు వెళ్లిన ఫొటోను షేర్ చేయడం.. జైలు బ్యాడ్జీ తనకు ఆరాధనీయం అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.