ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర ప్రభుత్వం విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని పద్మశాలి చేనేత సహకార సంఘం కార్యాలయంలో గురువారం స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… కొండా లక్ష్మణ్ బాపూజీ డిల్లీలో తెలంగాణ కోసం నిరాహారదీక్ష చేశాడన్నారు. బాపూజీ చేనేత కార్మిక ఉద్యమం, సహకార సంఘాల కోసం కృషి చేశారని, చేనేత సహకార సంఘం, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం, మత్స్య కార్మిక, చర్మకార సహకార సంఘాల కోసం కృషి చేసిన మహనీయుడని అన్నారు. బలహీన వర్గాల గొంతును బలంగా విన్పిస్తూ నిఖార్సయిన తెలంగాణ వాదాన్ని నింపుకొని మూడు తరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన ఓ గొప్ప శిఖరంలా నిలిచారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనలో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.