ఐడిఓసి లో అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్ కొరకు సోలార్ షెడ్ తోపాటు, 100 కిలో వాట్ సోలార్ పవర్ ప్లాంట్, గ్రిడ్ కు అనుసంధాన ప్రక్రియను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రొత్తగా నిర్మాణం చేసిన ఐడిఓసి లలో ఖమ్మం జిల్లాలో మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్టుగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
100 కిలో వాట్ సోలార్ పవర్ ప్లాంట్ తో రోజుకు 400 నుండి 500 యూనిట్ల పవర్ ఉత్పత్తి అవుతుందని, ఇట్టి ప్లాంట్ ఉత్పత్తి పవర్ ని ఐడిఓసి అవసరాలకు ఉపయోగించనున్నట్లు, ఐడిఓసి అవసరాలకు పోనూ మిగిలిన పవర్, గ్రిడ్ అనుసంధానంతో గ్రిడ్ కు వెళుతుందని, దీనితో విద్యుత్ నికర వినియోగానికి మాత్రమే బిల్లు వస్తుందని కలెక్టర్ అన్నారు.
సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో నెలకు సుమారు 80 వేల నుండి లక్ష రూపాయల వరకు విద్యుత్ చార్జీల ఆదా అవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 100 కిలో వాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు పూర్తయి, ప్రారంభించినట్లు, ఆగస్టు 15 లోగా మరో 100 కిలో వాట్ల పవర్ ప్లాంట్ పూర్తయి, మొత్తం 800 నుండి 1000 వాట్ల పవర్ రోజుకు ఐడిఓసి అవసరాలకు అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, విద్యుత్ శాఖ ఎస్ఇ ఏ. సురేందర్, కలెక్టరేట్ ఏవో అరుణ, శ్రీ అసోసియేట్ ఎండి టి. శ్రీహరి బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.