Kishan Reddy| కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ మిడి మిడి జ్ఞానంతో రేవంత్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గవర్నర్ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు న్యాయవాదుల అనుమతి తీసుకోవడం సాధారణమని తెలిపారు. అమృత్ స్కీమ్‌లో(Amrit Scheme Tenders) జరిగిన అవినీతిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ తామే కోర్టుకు వెళ్లామని గుర్తు చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కూడా సీబీఐ విచారణకు తామే డిమాండ్ చేశామని.. సీబీఐ విచారణ కూడా కాంగ్రెస్ పార్టీ అడిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీతో లాలూచీ పడ్డారు కాబట్టే ఈ కేసుల విచారణను నీరు గారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని దుయ్యబట్టారు.
మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అతలకుతలమైందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అలాగే వ్యవహరిస్తోంది. బీజేపీకి కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) సర్టిఫికెట్ అక్కర్లేదన్నారు. ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకలేని మొఖాలు ఇవాళ మేమేం చేయాలో చెప్పనక్కర్లేదని సూచించారు. ప్రజలతో తప్ప ఏ పార్టీతో బీజేపీ ములాఖత్ అవ్వలేదన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.