Kishan Reddy comments on CM Revanth Reddy: ఓటమి భయంతోనే బీజేపీ సభకు కాంగ్రెస్ సర్కార్ అనుమతి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బోరబండలో ఈ రోజు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిర్వహించతలపెట్టిన సభకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ చేయనున్న ప్రచారంలో భాగంగా గురువారం బోరబండలో బీజేపీ సభ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో పోలీసులు అనుమతి రద్దు చేయడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహించారు. బీజేపీ సభకు అనుమతి రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. తాను కూడా ఆ రోడ్‌షోలో పాల్గొనాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ తమ సభకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు.
ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో మార్చిపోయారని కిషన్ రెడ్డి ఆరోపించారు. .సీఎం రేవంత్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. మేడిగడ్డపైనే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కోరుతుందని.. కానీ మొత్తం ప్రాజెక్ట్‌పై దర్యాప్తు జరగాలన్నది తమ ఆలోచన అని స్పష్టం చేశారు. ఢిల్లీ స్థాయిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని దుయ్యబట్టారు. అందుకే కేసీఆర్‌పై రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని.. ఈ అంశంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై కిషన్ రెడ్డి పలు విమర్శలు చేశారు. ముస్లింలపై కాంగ్రెస్‌కు నిజంగా ప్రేమే ఉంటే గత రెండేళ్లలో వారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో తప్పు జరిగిందని చార్మినార్ దగ్గర ముక్కునేలకు రాస్తారా అని కిషన్ రెడ్డి సవాలు విసిరారు.


