Friday, September 20, 2024
HomeతెలంగాణKishtapur: లారీలు రాక అన్నదాతల ఘోష

Kishtapur: లారీలు రాక అన్నదాతల ఘోష

కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. లారీలు రాక ధాన్యం కుప్పలు ఎక్కడివక్కడ మిగిలిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రోగాల బారిన పడి కొంత, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొంత ధాన్యాన్ని నష్టపోయామని, ఇప్పుడు వడ్లు ఆరబెట్టి కుప్పలు నూకి నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ మా ధాన్యం తూకం జరగలేదన్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం 17 మ్యాచరు రావాల్సి ఉండగా మా ధాన్యం 10, 11 కు మ్యాచర్ కు పడిపోయింది అన్నారు. ఈ మ్యాచర్ తో తూకం వేస్తే ధాన్యం తక్కువ వజను వచ్చి తాము చాలా మేరకు నష్టపోవాల్సి వస్తుందన్నారు. దీనికి తోడు బస్తాకు మూడు కిలోల 200 గ్రాములు ధాన్యం తరుగు పేరుతో కోత విధిస్తున్నారన్నారు.
గత వారం రోజుల క్రితం ఒక లారీ వచ్చిందని, ఇప్పటివరకు తమ సెంటర్కు ఒక్క లారీ దిక్కు లేదన్నారు. ఇప్పటికే సుమారు మూడు నాలుగు వందల బస్తాలు ధాన్యం తూకం వేసి పెట్టి టాపర్లతో కప్పి ఉంచామన్నారు. ఈ తూకం వేసిన ధాన్యం బస్తాకు మూడు కిలోల 200 గ్రాముల తరుగుతో తూకం వేయగా వారం రోజులపాటు ఎండలో ఉండడంతో మిల్లుకు చేరేసరికి మరింత తరుగు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విధంగా వచ్చిన తరుగును కూడా అటు రైస్ మిల్లర్లు ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతుల మీదనే మోపుతున్నారన్నారు. లారీ లోడింగ్ కు వస్తే ఒక్కో బస్తాకు పది రూపాయల చొప్పున అదనంగా చెల్లిస్తున్నామని అయినా లారీలు రావడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి తమ ఒక రోజుకు ఒక్క లారీ వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకున్నారు.
కాగా ధాన్యం తూకం అయిపోయిన తరువాత లారీలను పిలిచి లోడింగ్ చేయించి రైస్ మిల్లులో డంప్ చేయించే వరకు కొనుగోలు సెంటర్ నిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉండగా, ఈ పూర్తి భారం రైతుల మీదనే మోపుతున్నారు. తూకం వేయించిన బస్తాల పై టాపర్ కప్పడం నుంచి, ఒకవేళ వర్షం పడితే తూకం వేసిన ధాన్యం బస్తాలు తడవకుండా చూసుకునే బాధ్యత కూడా పూర్తిగా రైతుదే. ఒకవేళ వర్షానికి తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసినా, లేదా తీవ్ర ఎండలకు తూకం వేసిన ధాన్యం బస్తాలలో తరువు వచ్చినా వచ్చే నష్టాన్ని రైతే భరించాల్సి ఉంటుంది. ఇది నేడు కొనుగోలు సెంటర్ల తీరు.

- Advertisement -

సహకార సంఘం చైర్మన్ వివరణ

రైతుల సమస్యపై కిష్టాపూర్ సహకార సంఘం చైర్మన్ మల్లేశం గౌడ్ ను వివరణ కోరగా తమ సెంటర్కు లారీలు రావడంలేదని, రైతుల ధాన్యం కుప్పలు ఎక్కడవక్కడ నిలిచి ఉన్నాయని, బస్తాకు మూడు కిలోల 200 గ్రాముల చొప్పున తరుగుకోత విధిస్తుండడం వాస్తవమని చెప్పి చేతులు దులుపుకున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు గాని స్థానిక తహసిల్దార్ గాని వ్యవసాయ అధికారి గాని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తో మాట్లాడి తమకు రోజు ఒక లారీ చొప్పున వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News