కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోవటానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరణం ఆసన్నమైందని కేటీఆర్ (KTR) అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ కి అధికారం ఇస్తే తెలంగాణ మళ్లీ అంధకార పరిస్థితిలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. వీరి పాలనలో అట్టడుగు వర్గాల నుంచి సంపన్న వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారని ధ్వజమెత్తారు.
నవంబర్ 29, 2009న “కేసిఆర్ సచ్చుడో… తెలంగాణ తెచ్చుడో…” అంటూ కేసిఆర్ చేపట్టిన నిరాహార దీక్ష 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పింది అని కేటీఆర్ (KTR) అన్నారు. అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి… కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భమే దీక్ష దివస్ (Deeksha Divas) అన్నారు. అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రమైందని చెప్పుకొచ్చారు. మళ్లీ ఈరోజు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి, అవి నిర్బంధాలు, అవే అణిచివేతలు, అవే దుర్భర పరిస్థితుల నేపథ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనిపిస్తున్నాయి అని కేటీఆర్ మండిపడ్డారు.
Also Read : అది నోరు కాదు మూసీ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు
ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్ళీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి ప్రతి పౌరుని పై ఉంది అని కేటీఆర్ తెలిపారు. అందుకే దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది నవంబర్ 29న 33 జిల్లాల్లో మా పార్టీ కార్యాలయాల్లో ఘనంగా దీక్షా దివస్ (Deeksha Divas) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అంతేకాదు, కేసీఆర్ తన దీక్ష ముగించిన డిసెంబర్ 9 రోజున మేడ్చల్ లో తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Thalli Statue) ఆవిష్కరిస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు. పార్టీ నాయకులంతా ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతామన్నారు. కేసీఆర్ దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా ఘనమైనదని, ఆరోజు నిమ్స్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిందని చెప్పారు. అందుకే ఆరోజు నిమ్స్ హాస్పిటల్లో అన్నదానం రోగులకు పండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. దీక్షా దివస్ తోపాటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గులాబీ కుటుంబ సభ్యులకు పిలుపునిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఆనాటి కార్యక్రమాలు, ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు