MLA Sudarshan Reddy appointed as Advisor: తాను మంత్రి పదవి ఆశించిన మాట వాస్తమేనని, అయితే, కొన్ని సమీకరణాల వల్ల ఆ పదవి దక్కలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. సెక్రటేరియట్‌లో బుధవారం ఉదయం ప్రభుత్వ సలహాదారుగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు బాధ్యతలు అప్పగించినందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ”గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తా. తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పనికిరాని పథకాలను ప్రవేశపెట్టి ప్రజలపై భారాన్ని మోపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. సంక్షేమ పథకాల కోసమే ఇప్పటి వరకు 7 వేల కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు. ఉన్న పథకాలను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాం.”అని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు తన కార్యాలయంలో కుటుంబ సభ్యులతో సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. కాగా, మంత్రి వర్గంలో చోటు ఆశించి భంగపడ్డ సుదర్శన్‌రెడ్డితో పాటు కె. ప్రేంసాగర్‌రావులకు కేబినెట్ హోదా కల్పించింది. ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత అప్పగిస్తూ.. సుదర్శన్‌రెడ్డిని సలహాదారుగా నియమించింది. మరోవైపు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పదవిని ప్రేంసాగర్‌రావుకు కట్టబెట్టింది. అటు కొత్తగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న అజహరుద్దీన్‌కు మైనారిటీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను అప్పగించింది.
కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా..
సుదర్శన్ రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పలు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఆయనను కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేకపోవడంతో ఆయనకు బెర్త్ ఖారారైనట్లేనని అందరూ భావించారు. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా దీనిపై అధిష్ఠానం సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రాధాన్యంగా అమలు చేసే అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారునిగా సుదర్శన్ రెడ్డిని నియమించారు. ఈ కార్యక్రమాల అమలుపై జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులతో ఆయన సమీక్షించే అవకాశం ఉంటుంది. సుదర్శన్ రెడ్డికి మంత్రులతో పాటు వసతి, ఇతర సదుపాయాలు కల్పించాలని, సెక్రటేరియట్‌లో మంత్రుల ఛాంబర్స్ దగ్గరే ఆయన ఛాంబర్ కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన అన్ని కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారని తెలిపింది. ప్రభుత్వం ప్రాధాన్యంగా అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాల యూనిట్‌కు స్పెషల్ చీఫ్ సెక్రటరీ/ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి స్థాయి అధికారి అధిపతిగా ఉంటూ సలహాదారుకు సహకరిస్తారని, ఆయా పథకాల అమలు తీరుపై ఈ యూనిట్ ఎప్పటికప్పుడు మంత్రివర్గానికి నివేదిస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


