తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయనతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావును భారత్‌కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో త్వరలోనే వీరిద్దరు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు.
తాను ఎక్కడికి పారిపోలేదని చికిత్స కోసమే అమెరికా వెళ్లినట్టు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నానని.. ఈ కేసులో నిందితుడిగా చేర్చడానికి ముందే తాను అమెరికా వచ్చానని తెలిపారు. అయినా కానీ తాను పారిపాయనని ముద్ర వేయడం సరికాదన్నారు. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని అందుచేత ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తమకు మరింత గడువు కావాలి ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. దీంతో ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ రెండు వారాలపాటు న్యాయస్థానం వాయిదా వేసింది.