Aarogyasri scheme: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి భారీగా బకాయిలు రావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.
అందుకే సేవల నిలిపివేత: ఈ మేరకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి సుమారు రూ. 1,400 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రితో పాటుగా ఆరోగ్యశ్రీ సీఈవోలను కలిసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. అందుకే ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
మొత్తం చెల్లించాల్సిందే..: ఇటీవల ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులతో జరిపిన చర్చల మేరకు రూ. 140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా సోమవారం రూ. 100 కోట్లు విడుదల చేసినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. మరో రూ. 40 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ.. ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం తమకు రావాల్సిన మొత్తం బకాయిలు ఇంకా చాలా ఉన్నాయని చెబుతున్నాయి.
ఆరోగ్యశ్రీ పథకం ప్రధాన ఉద్దేశ్యం: ఆరోగ్యశ్రీ అనేది పేద కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించే పథకం. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు పెద్ద పెద్ద ఆపరేషన్లకు, చికిత్సలకు ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం పొందవచ్చు.
కవరేజ్ మొత్తం: ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి ₹10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఇది గతంలో ఉన్న ₹5 లక్షల పరిమితిని పెంచిన తర్వాత అమల్లోకి వచ్చింది.
వైద్య విధానాలు: ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దాదాపు 1,835 రకాల వైద్య చికిత్సలు మరియు శస్త్రచికిత్సలు కవర్ చేయబడ్డాయి. ఇందులో గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన చికిత్సలు ఉన్నాయి.
నగదు రహిత సేవలు: ఈ పథకం కింద లబ్ధిదారులు నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. చికిత్స పూర్తి అయిన తర్వాత ఆసుపత్రికి ప్రభుత్వం నేరుగా నిధులను చెల్లిస్తుంది.
ఆరోగ్య మిత్రలు: ఆసుపత్రులలో ఆరోగ్య మిత్రలు ఉంటారు. వీరు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి అవసరమైన సమాచారం అందించి.. చికిత్స ప్రక్రియలో సహాయం చేస్తారు.


